
వారికంటే పెద్ద తప్పులు చేసిన వారు చాలా మంది ఉన్నారు..
ముంబై : మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్‌కు గురైన టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లకు నిషేధిత క్రికెటర్ శ్రీశాంత్ మద్దతు తెలిపారు. కాఫీ విత్ కరణ్ షోలో సోయితప్పి మాట్లాడిన ఈ యువఆటగాళ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతుండగా.. శ్రీశాంత్ మీడియా ముందుకు వచ్చి మద్దతు పలకడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా పాండ్యా, రాహుల్‌లు మ్యాచ్ విన్నర్‌లని, ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారతజట్టుకు వారి సేవలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు. వారు దూరమైతే జట్టుకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పుకొచ్చాడు.
వారు మాట్లాడింది తప్పే అయినప్పటికి, వారికంటే పెద్ద తప్పులు చేసిన వారు చాలా మంది ఉన్నారని తెలిపాడు. వారంతా యధేచ్చగా వారి పనులు వారు చేసుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇక త్వరలోనే బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తుందని, తన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు మార్గం సుగమం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్.. హిందీ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.