
లైన్ క్లియర్
ఉత్కంఠ వీడింది... చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు రంగం సిద్ధమైంది. అయితే అనేక మలుపులు తిరుగుతూ వచ్చిన ఈ సిరీస్‌కు వేదికగా అనూహ్యంగా శ్రీలంక పేరు తెరపైకి వచ్చింది. భారత్‌లో ఆడేందుకు పాక్.. యూఏఈలో ఆడేందుకు భారత్ అయిష్టత చూపడంతో ఇరు బోర్డులు లంక వైపు మొగ్గాయి. దుబాయ్‌లో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికారికంగా మాత్రం 27న వేదికను ప్రకటించనున్నారు.
భారత్, పాకిస్తాన్‌ల క్రికెట్ సిరీస్ శ్రీలంకలో
* ఇరు బోర్డుల అంగీకారం
* 27న అధికారిక ప్రకటన
* డిసెంబరులో మ్యాచ్‌లు
దుబాయ్: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన క్రికెట్ సిరీస్‌కు మార్గం సుగమమైంది. దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కార్యాలయంలో ఆదివారం బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్‌ల మధ్య చర్చలు జరిగాయి.
ఇందులో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈబీసీ) చైర్మన్ గైల్స్ క్లార్క్ కూడా పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ఈ సిరీస్‌కు శ్రీలంకను వేదికగా చేసుకోవాలని ఇరు బోర్డులు ఓ అంగీకారానికి వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో ఈ సిరీస్‌కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంటుంది. పాక్‌లో భద్రతాపరమైన సమస్యలు ఉండడంతో గతంలోనే తమ సొంత వేదికను యూఏఈకి మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేదికపై ఆడేందుకు బీసీసీఐ వ్యతిరేకత వ్యక్తపరుస్తూ సిరీస్‌కు తామే ఆతిథ్యం ఇస్తామని పీసీబీకి తెలిపింది.
అయితే ఈ సూచనను పీసీబీ తోసిపుచ్చుతూ ఎట్టి పరిస్థితిలోనూ తాము భారత్‌లో ఆడేది లేదని స్పష్టం చేసింది. దీంతో సిరీస్‌పై ప్రతిష్టంభన నెలకొనగా దుబాయ్‌లో ఆదివారం ఇరు వర్గాల మధ్య జరిగిన చర్చల్లో మధ్యే మార్గంగా శ్రీలంకను తటస్థ వేదికగా నిర్ణయించారు. 2009 లాహోర్‌లో ఉగ్రవాదుల దాడుల అనంతరం పాకిస్తాన్ తమ సొంత మ్యాచ్‌లను యూఏఈలో ఆడిస్తోంది.
27న అధికారిక ప్రకటన: భారత్, పాక్ వన్డే సిరీస్ వేదికపై కథనాలు వెలువడినా ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. ముందుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ నుంచి సిరీస్‌పై పీసీబీకి అనుమతి రావాల్సి ఉంది. ఆ తర్వాత పాక్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ తిరిగి దుబాయ్‌కి వచ్చి గైల్స్ క్లార్క్‌కు విషయం చెప్పాలి. ఆ తర్వాతే ఈనెల 27న ఆయన అధికారికంగా శ్రీలంక వేదికను ప్రకటిస్తారు. పీసీబీ ఇప్పటికే శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ)ను ఆతిథ్యంపై సంప్రదించగా సానుకూలత వ్యక్తమైంది. ప్రేమదాస, పల్లెకెలెలో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
మూడు వన్డేలు, రెండు టి20లు: పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం ఇరు జట్ల మధ్య రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరగాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా కేవ లం మూడు వన్డేలు, రెండు టి20లు మాత్రమే ఆడే అవకాశం ఉంది.