డిక్ వెల్లా పై రెండు మ్యాచ్ల నిషేధం
గీలాంగ్:ఆస్ట్రేలియాతో ఆదివారం ఇక్కడ జరిగిన రెండో ట్వంటీ 20 లో అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబట్టిన శ్రీలంక ఆటగాడు నిరోషాన్ డిక్ వెల్లా రెండు మ్యాచ్లు నిషేధానికి గురయ్యాడు. తను అవుటైనట్లు రిప్లేలో స్పష్టంగా కనిపించినప్పటికీ ఆ నిర్ణయంతో డిక్ వెల్లా ఏకీభవించలేదు. అంపైర్ల నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు. ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు రావడంతో అతనిపై చర్యలు తీసుకోనున్నట్లు ఐసీసీ తాజా ప్రకటనలో తెలిపింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు రెండు డీమెరిట్ పాయింట్లను విధిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాల్గో వన్డేలో కూడా డిక్ వెల్ నిబంధనల్ని ఉల్లంఘించాడు. ఐసీసీ తాజా నిబంధలన ప్రకారం రెండేళ్ల కాలంలో ఒక క్రికెటర్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడి నాలుగు డీమెరిట్ పాయింట్లకు పైగా తన ఖాతాలో వేసుకుంటే రెండు మ్యాచ్లు నిషేధం ఎదుర్కోక తప్పదు. ఈ తాజా చర్యతో డిక్ వెల్ ఖాతాలో ఐదు డీమెరిట్ పాయింట్లు వచ్చి చేరాయి. దాంతో ఆస్ట్రేలియాతో బుధవారం జరిగే మూడో ట్వంటీ 20 మ్యాచ్ కు డిక్ వెల్ దూరం కానుండగా, ఆ తరువాత మార్చి 25వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే తొలి వన్డేలో డిక్ వెల్ పాల్గొనే అవకాశం లేదు.