శ్రీజకు ‘సుకుమార స్పోర్ట్స్’ స్కాలర్‌షిప్ | srija sukumara sports scholarship | Sakshi
Sakshi News home page

శ్రీజకు ‘సుకుమార స్పోర్ట్స్’ స్కాలర్‌షిప్

Published Mon, Jan 27 2014 1:03 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

srija sukumara sports scholarship

సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీల్లో విశేషంగా రాణిస్తున్న శ్రీజకు ‘సుకుమారా స్పోర్ట్స్’ స్కాలర్‌షిప్ దక్కింది. మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్)లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దివంగత డీజీపీ ఎస్.ఆర్.సుకుమార పేరు మీద ఆయన సతీమణి భాను సుకుమార స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌ను అందజేశారు. 68 ఏళ్ల వయస్సులో సుకుమార గతేడాది రిపబ్లిక్ డే రోజు మృతిచెందారు.
 
  క్రీడలంటే అమితాసక్తిని కనబరిచే తన భర్త స్మారకార్థం ప్రతి ఏడాది  ప్రోత్సాహకాన్ని అందజేయాలనుకున్నామని, ఆదివారం తొలి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అమ్మాయి శ్రీజను ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేశామని భాను సుకుమార తెలిపారు. ఇందులో భాగంగా శ్రీజకు రూ. 10 వేల చెక్‌తో పాటు మెమెంటోను ప్రదానం చేశారు. నగరంలోని గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)లో సోమనాథ్ ఘోష్ నేతృత్వంలో శిక్షణ పొందిన ఆమె గతేడాది రికార్డు స్థాయిలో 12 పతకాలు సాధించింది. ఇందులో ఐదు అంతర్జాతీయ స్వర్ణాలున్నాయి.
 
  ప్రపంచ 33వ ర్యాంకర్ (జూనియర్ కేటగిరీ)లో ఉన్న ఆమె జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకులో కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా శ్రీజ చెప్పింది. క్రికెట్‌లో రాణిస్తున్న ప్లంబర్ కుమారుడైన దీపక్ నాయక్‌కూ ప్రోత్సాహక బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో సుకుమార కుమార్తె భావన నారాయణన్, ఎస్‌సీఎఫ్ కార్యదర్శి కె.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement