శ్రీజ బృందానికి స్వర్ణం
స్లొవేకియా ఓపెన్ టీటీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) గ్లోబల్ జూనియర్ సర్క్యూట్‌లో భాగంగా జరుగుతున్న స్లొవేకియా ఓపెన్‌లో హెదరాబాద్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. స్లొవేకియాలోని సెనెక్ పట్టణంలో శుక్రవారం రాత్రి ముగిసిన టీమ్ విభాగం ఫైనల్లో భారత్ 3-2 తేడాతో చైనీస్ తైపీపై గెలిచింది.
ప్రియదర్శిని, అహిక ముఖర్జీ, శ్రీజలతో కూడిన భారత బృందం టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో ప్రియదర్శిని 5-11, 11-4, 8-11, 11-13తో లీ యు పెంగ్ చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో అహిక 11-4, 11-7, 11-6తో కువో చియా యున్‌పై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో శ్రీజ 4-11, 11-9, 12-14, 11-13తో హుంగ్ హుంగ్ చేతిలో ఓటమి చెందగా... నాలుగో మ్యాచ్‌లో అహిక 8-11, 9-11, 11-9, 11-3, 11-8తో లీ యు పెంగ్‌పై గెలిచింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ప్రియదర్శిని 6-11, 11-7, 13-11, 12-10తో కువో చియా యున్‌పై నెగ్గింది.