International table tennis
-
మనుశ్–రేగన్‌లకు కాంస్యం
స్పా (బెల్జియం): అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ ప్రీమియర్ టోర్నమెంట్లో మిక్స్డ్ టీమ్ జూనియర్ బాలుర ఈవెంట్లో మనుశ్ షా–రేగన్ అల్బుక్యూర్క్యూ (భారత్)లకు కాంస్య పతకం లభించింది. అమీన్ అహ్మదియన్–రాదిన్ ఖయ్యమ్ (ఇరాన్)లతో కలిసి మనుశ్–రేగన్ బరిలోకి దిగారు. సెమీఫైనల్లో భారత్–ఇరాన్ జట్టు 0–3తో జపాన్–న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో అమీన్ 1–3తో యోషియామ (జపాన్) చేతిలో... రెండో సింగిల్స్‌లో మనుశ్ 2–3తో కషివా (జపాన్) చేతిలో... మూడో సింగిల్స్‌లో రాడిన్ ఖయ్యమ్ 0–3తో నాథన్ జు (న్యూజిలాండ్) చేతిలో ఓడిపోయారు. -
శ్రీజ బృందానికి స్వర్ణం
స్లొవేకియా ఓపెన్ టీటీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) గ్లోబల్ జూనియర్ సర్క్యూట్లో భాగంగా జరుగుతున్న స్లొవేకియా ఓపెన్‌లో హెదరాబాద్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. స్లొవేకియాలోని సెనెక్ పట్టణంలో శుక్రవారం రాత్రి ముగిసిన టీమ్ విభాగం ఫైనల్లో భారత్ 3-2 తేడాతో చైనీస్ తైపీపై గెలిచింది. ప్రియదర్శిని, అహిక ముఖర్జీ, శ్రీజలతో కూడిన భారత బృందం టాప్ సీడ్ హోదాలో బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో ప్రియదర్శిని 5-11, 11-4, 8-11, 11-13తో లీ యు పెంగ్ చేతిలో ఓడిపోగా... రెండో మ్యాచ్‌లో అహిక 11-4, 11-7, 11-6తో కువో చియా యున్‌పై నెగ్గింది. మూడో మ్యాచ్‌లో శ్రీజ 4-11, 11-9, 12-14, 11-13తో హుంగ్ హుంగ్ చేతిలో ఓటమి చెందగా... నాలుగో మ్యాచ్‌లో అహిక 8-11, 9-11, 11-9, 11-3, 11-8తో లీ యు పెంగ్‌పై గెలిచింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో ప్రియదర్శిని 6-11, 11-7, 13-11, 12-10తో కువో చియా యున్‌పై నెగ్గింది. -
పట్టుదలతో ఫలితాలు: నైనా
శాలిబండ, న్యూస్‌లైన్: విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోకుండా గుణాత్మకమైన విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారిణి నైనా జైస్వాల్ సూచించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సందర్భంగా పాతబస్తీ హుస్సేనీఆలంలోని వెస్ట్రన్ ఇంటర్నేషనల్ స్కూల్లో హైదరాబాద్ మహిళ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ మహిళా మండలి ప్రతినిధులు నైనా జైస్వాల్‌ను ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత నైనా జైస్వాల్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తే ఆశించిన ఫలితాలు సాధిస్తారన్నారు. హైకోర్టు న్యాయవాదులు పుష్పేందర్ కౌర్, గమన్దీప్ కౌర్‌లతో పాటు హైదరాబాద్ మహిళా మండలి అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ మహమ్మదీ బేగంలు మాట్లాడుతూ... అతి చిన్న వయస్సులో నైనా జైస్వాల్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారన్నారు. ఎనిమిదేళ్లకే ఎస్ఎస్సీ ఉత్తీర్ణత సాధించి... 13 ఏళ్లకే డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నైనా జైస్వాల్‌ను విద్యార్థినీలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండలి అధ్యక్షులు డాక్టర్ మునావర్ సుల్తానా, డెరైక్టర్ మహమ్మద్ ఇమామ్ తహసీన్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీజకు ‘సుకుమార స్పోర్ట్స్’ స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ పోటీల్లో విశేషంగా రాణిస్తున్న శ్రీజకు ‘సుకుమారా స్పోర్ట్స్’ స్కాలర్షిప్ దక్కింది. మాసబ్‌ట్యాంక్‌లోని స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్సీఎఫ్)లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దివంగత డీజీపీ ఎస్.ఆర్.సుకుమార పేరు మీద ఆయన సతీమణి భాను సుకుమార స్పోర్ట్స్ స్కాలర్షిప్ను అందజేశారు. 68 ఏళ్ల వయస్సులో సుకుమార గతేడాది రిపబ్లిక్ డే రోజు మృతిచెందారు. క్రీడలంటే అమితాసక్తిని కనబరిచే తన భర్త స్మారకార్థం ప్రతి ఏడాది ప్రోత్సాహకాన్ని అందజేయాలనుకున్నామని, ఆదివారం తొలి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ అమ్మాయి శ్రీజను ఈ స్కాలర్షిప్కు ఎంపిక చేశామని భాను సుకుమార తెలిపారు. ఇందులో భాగంగా శ్రీజకు రూ. 10 వేల చెక్‌తో పాటు మెమెంటోను ప్రదానం చేశారు. నగరంలోని గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)లో సోమనాథ్ ఘోష్ నేతృత్వంలో శిక్షణ పొందిన ఆమె గతేడాది రికార్డు స్థాయిలో 12 పతకాలు సాధించింది. ఇందులో ఐదు అంతర్జాతీయ స్వర్ణాలున్నాయి. ప్రపంచ 33వ ర్యాంకర్ (జూనియర్ కేటగిరీ)లో ఉన్న ఆమె జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకులో కొనసాగుతోంది. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా శ్రీజ చెప్పింది. క్రికెట్లో రాణిస్తున్న ప్లంబర్ కుమారుడైన దీపక్ నాయక్‌కూ ప్రోత్సాహక బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో సుకుమార కుమార్తె భావన నారాయణన్, ఎస్సీఎఫ్ కార్యదర్శి కె.సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. -
నైనా జోడికి స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి నైనా జైస్వాల్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇరాన్‌లోని టెహ్రాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో నైనా, మోమిత దత్తాలతో కూడిన భారత బాలికల క్యాడెట్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్ 3-0 తేడాతో ఆతిథ్య ఇరాన్‌ను ఓడించింది. రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గిన నైనా, మోమిత... జోడిగా దిగిన డబుల్స్ మ్యాచ్‌లోనూ గెలిచారు. అంతకుముందు సెమీఫైనల్లో నైనా బృందం 3-0తో జోర్డాన్‌పై గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌తోపాటు అజర్బైజాన్, తుర్క్మెనిస్థాన్, జోర్డాన్, ఇరాన్, బెలారస్, హంగేరి తదితర జట్లు పాల్గొన్నాయి.