జంట నగరాల్లోని ఏపీ విద్యార్థులను తిరస్కరిస్తున్న ‘ఈ పాస్’
* రెన్యువల్ కాని స్కాలర్‌షిప్‌లు, ఫీజులు
* ఏపీ ప్రభుత్వం మెలికతో ఇబ్బందుల్లో 2 లక్షల మంది విద్యార్థులు
* ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్వర్‌ను వేరు చేయకపోవడంతో తిప్పలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు హైదరాబాద్‌లో చదువుకుంటున్న 2 లక్షల మంద్రి ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పాలిట శాపం గా మారింది. వారికి ‘ఈ పాస్’లో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రెన్యువల్ కావడంలేదు. తొలి సంవత్సరం ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి ప్రవేశించిన విద్యార్థులు ఈ పాస్ ద్వారా రెన్యువల్స్ చేసుకోవాల్సి ఉంది. అయితే, జంట నగరాలు, రంగారెడ్డి జిల్లాలో చదువుతున్న ఏపీ విద్యార్థుల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ రెన్యువల్ చేయడానికి ఆంధ్రా జిల్లాల నుంచి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధన విధించింది.
మరోపక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్వర్‌ను ఇరు రాష్ట్రాలూ అలాగే కొనసాగిస్తున్నాయి. ఏపీ సర్కారు వేరేగా సర్వర్ ఏర్పాటు చేసుకోలేదు. దీంతో పాత సర్వర్‌లో ఏపీ విద్యార్థులు ఆంధ్రా జిల్లాల నుంచి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను తెచ్చినా ‘ఈ పాస్’లో రెన్యువల్ కావడంలేదు. జంటనగరాల నుంచి ధృవీకరణ పత్రాలు తెచ్చినప్పటికీ, వారు గత ఏడాది తెలంగాణ జిల్లాల్లో ఉన్నారన్న కారణంతో వారిని తెలంగాణకు చెందిన వారిగా గుర్తిస్తూ కంప్యూటర్ తిరస్కరిస్తోంది. దీంతో జంటనగరాలు, రంగారెడ్డి జిల్లాలోని 2 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజులు రెన్యువల్ కావడంలేదు.
ఆంధ్రప్రదేశ్ విధించిన నిబంధనను సడలించి, రెండు రాష్ట్రాలూ సర్వర్‌ను వేరు చేసుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తేనే ఈ విద్యార్థులకు రెన్యువల్ అవుతుందని, లేదంటే వారికి స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించకుండా పోతుందని అధికారవర్గాలే చెబుతున్నాయి. మరోపక్క.. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు 8,45,556 మంది ఉన్నారు. వీరిలోనూ 6,83,470 మంది విద్యార్థులవే మంగళవారం వరకు రెన్యువల్ అయ్యాయి. మిగతా వారివి పెండింగ్‌లో ఉన్నాయి. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ రెన్యువల్‌కు గడువు సోమవారంతో ముగిసింది. ఎక్కువ మందికి రెన్యువల్ కాకపోవడంతో ఈ గడువును ఈ నెల 24 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
సారీ.. మీకు ‘ఫీజులు’ రావు
Published Wed, Nov 19 2014 12:53 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement