మాంచెస్టర్: టీమిండియా ప్రధాన పేస్ ఆయుధం జస్‌ప్రీత్ బుమ్రాపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కురిపించాడు. భారత్ సెమీస్‌కు చేరడంలో బుమ్రా ముఖ్య పాత్ర పోషించాడని కొనియాడాడు. ఇక న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి సెమీ ఫైనల్లో సైతం బుమ్రానే కీలక పాత్ర పోషిస్తాడని శ్రీకాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.‘వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు బౌలింగ్‌లో బుమ్రా ప్రధాన ఆయుధం. కొత్త బంతితో అతను అద్భుతాలు చేయగలడు. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న జోడీని కూడా విడదీయగలిగే సత్తా అతని సొంతం. దీనికితోడు ఎప్పటిలాగే డెత్ ఓవర్లలోనూ అదే జోరు సాగిస్తున్నాడు. లీగ్ దశలో ఇంగ్లండ్, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో అదే నిరూపితమైంది’ అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంచితే బ్యాటింగ్ విభాగంలో ఐదు శతకాలతో రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మను కూడా ఈ మాజీ క్రికెటర్ ప్రశంసించాడు. ‘నిదానంగా, ప్రశాంతంగా ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న రోహిత్ మొదటి పవర్‌ప్లేలో పరుగులు రాకున్నా.. ఎక్కడా ఇబ్బందికి లోనుకావడం లేదు. చాలామంది ఆటగాళ్లు ఈ విషయంలో కాస్త అలసత్వం ప్రదర్శిస్తారు. కానీ రోహిత్ అలా కాదు. నిదానంగా ఇన్నింగ్ ఆరంభించినా.. చివర్లో ప్రమాదకరంగా మారుతున్నాడు’ అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. మంగళవారం మాంచెస్టర్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు తొలి సెమీ ఫైనల్లో తలపడనున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment