శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్!
గురునాథ్ బెట్టింగ్‌తో ఆయనకి సంబంధం లేదు
తేల్చిన జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ!
ముంబై: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వివాదంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్.శ్రీనివాసన్‌కు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ నివేదిక క్లీన్‌చిట్ ఇచ్చినట్టు సమాచారం. తమ తుది నివేదికను కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. తన అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్ కార్యకలాపాల్లో శ్రీనివాసన్‌కు గల సంబంధాలపై ఎలాంటి సాక్ష్యాలు లభించలేవని కమిటీ తెలిపిందని ఓ జాతీయ న్యూస్ చానెల్ కథనం ప్రసారం చేసింది.
ఈనెల 10న ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు విచారణ ప్రారంభించనుంది. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌ల బెట్టింగ్‌పై గురునాథ్ దోషిగానే ఉన్నా స్పాట్ ఫిక్సింగ్‌లో మాత్రం అతడికి వ్యతిరేకంగా కమిటీ సాక్ష్యాలను సేకరించలేకపోయింది. ఒకవేళ సాక్ష్యాలు లభించి ఉంటే... గురునాథ్‌తో పాటు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కూడా న్యాయపరంగా చిక్కుల్లో పడేది. గతంలో కమిటీ విచారణ పూర్తయ్యేదాకా శ్రీనివాసన్‌ను బీసీసీఐ అధ్యక్ష పదవికి దూరంగా ఉండాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు ఈ నివేదిక ఆయనకు గొప్ప ఊరటనిచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది.
బుకీతో భారత ఆటగాడికి సంబంధం
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో ఓ ప్రముఖ ఆటగాడికి బుకీలతో పాటు మ్యాచ్ ఫిక్సర్లతో సంబంధాలున్నట్టు జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తేల్చినట్టు సమాచారం. అయితే ఐపీఎల్‌లో వివాదాస్పద రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లో అతడు సభ్యుడు కాదని, అలాగే తను ప్రస్తుత భారత జట్టులో ఆడడం లేదని కమిటీ తన నివేదికలో తెలిపింది. 2011 ప్రపంచకప్ కూడా ఫిక్స్ అయ్యిందని గతంలో ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన సెమీస్ మ్యాచ్ ఫలితాన్ని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. ఒకవేళ ముద్గల్ కమిటీ ఆ ఆటగాడి భాగస్వామ్యంపై సాక్ష్యాలు వెలికితీస్తే మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇదిలావుండగా విచారణలో భాగంగా చాలామంది ప్రస్తుత భారత ఆటగాళ్లు కమిటీ ముందు హాజరయ్యారు. వీరిలో ఐపీఎల్‌లో చెన్నైకి ఆడే ఆటగాళ్లను గురునాథ్ పాత్ర గురించి ప్రశ్నించారు. బెట్టింగ్ వివాదంలో గురునాథ్ వాయిస్ శాంపిల్స్ కూడా సరిపోయినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది.