విజేత సెయింట్ జోసెఫ్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌లో సెయింట్ జోసెఫ్ స్కూల్ (మలక్‌పేట్) జట్టు సత్తా చాటింది. గుంటూర్‌లోని లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా జరిగిన ఈటోర్నీ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ జూనియర్ బాలుర జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన జూనియర్ బాలుర ఫైనల్లో సెయింట్ జోసెఫ్ 23–25, 25–23, 15–13తో సెయింట్ ఆన్స్ (పేట్ బషీరాబాద్)పై గెలుపొందింది.
మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) 25–21, 25–20తో లయోలా జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ ఆన్స్ 25–23, 25–23తో సెయింట్ జోసెఫ్స్ హబ్సిగూడపై, సెయింట్ జోసెఫ్స్ మలక్‌పేట్ 23–25, 25–23, 15–13తో లయోలా జట్టుపై విజయం సాధించాయి.
హెరిటేజ్ వ్యాలీ జట్టుకు మూడో స్థానం
ఈ టోర్నీ సీనియర్ బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన హెరిటేజ్ వ్యాలీ స్కూల్ మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో హెరిటేజ్ స్కూల్ జట్టు 25–20, 25–22తో అభ్యాస స్కూల్‌పై గెలుపొందింది. సీనియర్ బాలుర కేటగిరీలో నూజివీడు స్కూల్ జట్టు విజేతగా, ఎఫ్‌కేఎస్ రాజమండ్రి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఫైనల్లో నూజివీడు 25–20, 25–18తో ఎఫ్‌కేఎస్ జట్టును ఓడించింది.