Valley ball tourney
-
జాత్యహంకారం.. కెమెరాకు చిక్కిన ప్లేయర్
బెల్గ్రేడ్: జాత్యంహకారం, సెక్సీయెస్ట్ కామెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లపై వేటు పడుతున్న ఘటనలు ఈమధ్య వరుసగా జరుగుతున్నాయి. అంతేకాదు పాత ఘటనల్ని సైతం తవ్వి తీసి.. విమర్శిస్తున్నారు. ఈ తరుణంలో సెర్బియన్ వాలీబాల్ ప్లేయర్ ఒకరు.. కోర్టులోనే జాత్యహంకార ధోరణిని ప్రదర్శించి వేటుకి గురైంది. జూన్ 1న థాయ్‌లాండ్, సెర్బియా మహిళా జట్ల మధ్య వాలీబాల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో సంజా జుర్డ్జెవిక్ అనే సెర్బియన్ ప్లేయర్.. థాయ్‌లాండ్ ఆటగాళ్లను వెక్కిరిస్తూ సైగ చేసింది. ఇది థాయ్ ఆటగాళ్లు పట్టించుకోకపోయినా.. ఆమె అలా చేసినప్పుడు స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. దీంతో అగ్గిరాజుకుంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో సంజా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వివరణ ఇచ్చుకుంది. తాను మ్యాచ్ ముగిశాకే థాయ్‌లాండ్ టీంకు క్షమాపణలు చెప్పానని, ఇప్పుడు మరోసారి చెప్తున్నానని ప్రకటించింది. అయినా వివాదం చల్లారక పోవడంతో ఆమెపై రెండు మ్యాచ్‌ల నిషేధంతో పాటు 16 వేల పౌండ్ల ఫైన్ కూడా విధించింది ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్. ఈ జరిమానాను యాంటీ డిస్క్రిమినేషన్ ఛారిటీకి లేదంటే ఏదైనా ఎడ్యుకేషనల్ సొసైటీకి డొనేట్ చేయాలని వెల్లడించింది. మరోవైపు ఈ ఘటనపై సెర్బియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా క్షమాపణలు చెప్పింది.ఇంతకుముందు 2017లో సెర్బియన్ వాలీబాల్ టీం యూరోపియన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ తర్వాత.. ఇలాంటి చేష్టలకే పాల్పడి విమర్శలు ఎదుర్కొంది. 2008లో స్పానిష్ బాస్కెట్‌బాల్ టీం, 2017లో అర్జెంటీనా ఫుట్‌బాల్ టీం. చైనా వాళ్లను అవహేళన చేస్తూ కళ్లను చిన్నవి చేసి ఫొటోలు దిగి విమర్శలపాలయ్యాయి. చదవండి: ఫ్రస్ట్రేషన్ ట్వీట్లపై సారీ! -
ప్లే ఆఫ్స్‌కు చెన్నై స్పార్టన్స్
చెన్నై: ప్రొ వాలీబాల్ లీగ్‌లో చెన్నై స్పార్టన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై స్పార్టన్స్ 15–6, 13–15, 15–13, 15–11, 15–12తో అహ్మదాబాద్ డిఫెండర్స్‌పై గెలుపొంది ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకుంది. స్పార్టన్స్ ఆటగాడు రూడీ వెర్చాఫ్ 18 స్పైక్స్, 2 సర్వ్ పాయింట్లతో మొత్తం 20 పాయింట్లు స్కోర్ చేసి అతని పేరిటే ఉన్న రికార్డును మరోసారి అందుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో 20 పాయింట్లు సాధించడం వెర్చాప్‌కిది మూడోసారి. అంతేకాకుండా వెర్చాఫ్ 80 పాయింట్లు సాధించి లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటికే ఈ టోర్నీలో కాలికట్ హీరోస్, కొచ్చి బ్లూ స్పైకర్స్ సెమీస్‌లో అడుగుపెట్టాయి. నేడు యు ముంబా వాలీ, అహ్మదాబాద్ స్పైకర్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో చివరిదైన నాలుగో ప్లేఆఫ్ బెర్తు ఖరారు అవుతుంది. -
చెన్నై స్పార్టన్స్‌పై యు ముంబా గెలుపు
ప్రొ వాలీబాల్ లీగ్‌లో ఎట్టకేలకు బోణీ కొట్టిన యు ముంబా వాలీ జట్టు సెమీస్ ఆశల్ని సజీవంగా నిలబెట్టుకుంది. శనివారం చెన్నై స్పార్టన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 15–14, 15–8, 15–10, 10–15, 10–15తో నెగ్గింది. యు ముంబా కెప్టెన్ దీపేశ్ సిన్హా (11 పాయింట్లు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతను 5 స్పైక్, 2 బ్లాక్, మరో 4 సర్వీస్ పాయింట్లు సాధించాడు. నాలుగు మ్యాచ్‌లాడిన యు ముంబాకిది తొలి గెలుపు కాగా... చెన్నై కూడా నాలుగు మ్యాచ్‌లాడి ఒకటే గెలిచింది. నేడు చెన్నై స్పార్టన్స్‌తో అహ్మదాబాద్ డిఫెండర్స్ తలపడుతుంది. -
కొచ్చి శుభారంభం
కొచ్చి: తొలిసారి నిర్వహిస్తున్న ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్)లో కొచ్చి బ్లూ స్పైకర్స్ ఘనవిజయంతో శుభారంభం చేసింది. శనివారం ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కొచ్చి జట్టు 15–11, 15–13, 15–8, 15–10, 5–15తో యూ ముంబా వాలీ జట్టుపై జయభేరి మోగించింది. మ్యాచ్ మొదలైన కాసేపటికే సొంతగడ్డపై కొచ్చి జోరు కూడా మొదలైంది. చూస్తుండగానే వరుస సెట్లతో మ్యాచ్‌ను గెలిచింది. 5–0తో వైట్‌వాష్ చేస్తుందనిపించింది. కానీ చివరి సెట్ చేజారడంతో 4–1 సెట్లతో గెలిచింది. దీంతో ‘వైట్‌వాష్’తో లభించే బోనస్ పాయింట్లను కోల్పోయింది. కొచ్చి జట్టులో మను జోసెఫ్ (15 పాయింట్లు) చెలరేగాడు. 14 స్పైక్ పాయింట్లతో పాటు ఒక బ్లాక్ పాయింట్ తెచ్చిపెట్టాడు. మిగతావారిలో డేవిడ్ లీ (10), రోహిత్ (8), ప్రభాకరన్ (8), అండ్రెజ్ పాటుక్ (7) రాణించారు. యూ ముంబా వాలీ జట్టులో నికోలస్ డెల్ బియాంతో 9 స్పైక్, ఒక బ్లాక్ పాయింట్‌తో మొత్తం 10 పాయింట్లు సాధించగా, సహచరుల్లో శుభమ్ చౌదరి, ప్రిన్స్ చెరో 7 పాయింట్లు చేశారు. అంతకుముందు హడావుడిగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆరు జట్ల కెప్టెన్లతో పాటు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మైదానంలో మెరిసింది. నేడు (ఆదివారం) ఇక్కడే జరిగే లీగ్ మ్యాచ్‌లో కాలికట్ హీరోస్తో చెన్నై స్పార్టన్స్ తలపడుతుంది. -
బ్లాక్ హాక్స్ హైదరాబాద్ సిద్ధం
సాక్షి, హైదరాబాద్: క్రికెట్, బ్యాడ్మింటన్ తరహాలోనే వాలీబాల్ క్రీడలోనూ లీగ్‌ల సందడి మొదలైంది. ప్రేక్షకులకు అసలైన వాలీబాల్ మజాను అందించేందుకు ప్రొ వాలీబాల్ లీగ్ సిద్ధమైంది. ఫిబ్రవరి 2 నుంచి 22 వరకు జరుగనున్న ప్రొ వాలీబాల్ లీగ్ సీజన్–1తో వాలీబాల్ క్రీడాభిమానులకు మరింత చేరువ కానుంది. ఇందులో ఆరు జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. అహ్మదాబాద్ డిఫెండర్స్, బ్లాక్ హాక్స్ హైదరాబాద్, కాలికట్ హెర్డెస్, చెన్నై స్పార్టన్స్, కొచ్చి బ్లూ స్పైకర్స్, యు ముంబా వాలీ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫిబ్రవరి 2న కొచ్చి వేదికగా యు ముంబా వాలీ, కొచ్చి బ్లూ స్పైకర్స్ జట్ల మధ్య జరుగనున్న తొలి మ్యాచ్‌తో లీగ్‌కు తెర లేవనుంది. తొలి సీజన్లోనే తమ సత్తా చాటేందుకు హైదరాబాద్ ఫ్రాంచైజీ బ్లాక్ హాక్స్జట్టు సిద్ధమైంది. అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ కార్సన్ క్లార్క్, అంగముత్తు (యూనివర్సల్), అమిత్ కుమార్, రోహిత్ కుమార్, చిరాగ్, అలెక్స్(అటాకర్), సోను జకర్, గురమ్రీత్ పాల్, అశ్వల్ రాయ్ (బ్లాకర్), కమ్లేశ్ ఖటిక్ (లిబర్), నంది యశ్వం త్, ముత్తుస్వామి (సెట్టర్)లు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. జట్టు సభ్యులంతా గురువారం యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో ప్రాక్టీస్ చేశారు. -
విజేత సెయింట్ జోసెఫ్ స్కూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజియన్ ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్లో సెయింట్ జోసెఫ్ స్కూల్ (మలక్‌పేట్) జట్టు సత్తా చాటింది. గుంటూర్లోని లయోలా పబ్లిక్ స్కూల్ వేదికగా జరిగిన ఈటోర్నీ వాలీబాల్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ జూనియర్ బాలుర జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన జూనియర్ బాలుర ఫైనల్లో సెయింట్ జోసెఫ్ 23–25, 25–23, 15–13తో సెయింట్ ఆన్స్ (పేట్ బషీరాబాద్)పై గెలుపొందింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో సెయింట్ జోసెఫ్ (హబ్సిగూడ) 25–21, 25–20తో లయోలా జట్టును ఓడించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో సెయింట్ ఆన్స్ 25–23, 25–23తో సెయింట్ జోసెఫ్స్ హబ్సిగూడపై, సెయింట్ జోసెఫ్స్ మలక్‌పేట్ 23–25, 25–23, 15–13తో లయోలా జట్టుపై విజయం సాధించాయి. హెరిటేజ్ వ్యాలీ జట్టుకు మూడో స్థానం ఈ టోర్నీ సీనియర్ బాలుర విభాగంలో తెలంగాణకు చెందిన హెరిటేజ్ వ్యాలీ స్కూల్ మూడో స్థానంలో నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో హెరిటేజ్ స్కూల్ జట్టు 25–20, 25–22తో అభ్యాస స్కూల్‌పై గెలుపొందింది. సీనియర్ బాలుర కేటగిరీలో నూజివీడు స్కూల్ జట్టు విజేతగా, ఎఫ్‌కేఎస్ రాజమండ్రి జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఫైనల్లో నూజివీడు 25–20, 25–18తో ఎఫ్‌కేఎస్ జట్టును ఓడించింది.