రెండో రోజూ దుమ్ము రేపారు
♦ స్మిత్, వోజెస్ సెంచరీలు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 551/3 డిక్లేర్డ్ విండీస్ 91/6
మెల్‌బోర్న్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు పూర్తి పట్టు సాధించింది. తొలి రోజు ఆటలో రెండు శతకాలు నమోదు కాగా రెండో రోజు ఆదివారం కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (134 నాటౌట్; 8 ఫోర్లు), ఆడమ్ వోజెస్ (106 నాటౌట్; 12 ఫోర్లు) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆసీస్ 135 ఓవర్లలో మూడు వికెట్లకు 551 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్మిత్, వోజెస్ నాలుగో వికెట్‌కు అజేయంగా 223 పరుగులు జోడించారు.
అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విండీస్ బ్యాట్స్‌మెన్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. రోజు ముగిసే సమయానికి 43 ఓవర్లలో ఆరు వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్రీజులో డారెన్ బ్రేవో (13 బ్యాటింగ్), కార్లస్ బ్రాత్‌వైట్ (3 బ్యాటింగ్) ఉన్నారు. ఇంకా 460 పరుగులు వెనుకబడి ఉండగా చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్యాటిన్సన్, లియోన్, సిడిల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఆసీస్ కెప్టెన్ స్మిత్ ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు (1,404) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. తన అరంగేట్ర ఏడాదిలోనే వెయ్యి పరుగులు పూర్తి చేసిన మూడో ఆటగాడిగా వోజెస్ నిలిచాడు.
ఆసీస్ గడ్డపై ఓ ఇన్నింగ్స్‌లో నలుగురు ఆసీస్ బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.
ఈ సిరీస్‌లో ఆసీస్ కేవలం ఏడు వికెట్లు మాత్రమే కోల్పోయి 1,134 పరుగులు చేసింది. బ్యాటింగ్ సగటు 162. ఓ సిరీస్‌లో ఇదే అత్యధిక సగటు.