రూ. 84 లక్షలు కోల్పోనున్న స్టోక్స్!
లండన్: ఐపీఎల్ వేలంలో రికార్డు ధర (రూ. 14 కోట్ల 50 లక్షలు)కు అమ్ముడుపోయిన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అందులో కొంత మొత్తాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిబంధనల ప్రకారం కౌంటీలతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు ఆ జట్టు మ్యాచ్‌లలో పాల్గొనకపోతే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం అతని కాంట్రాక్ట్ మొత్తంలో నుంచి ఒక్కో రోజుకు 0.5 శాతం (సుమారు 3,500 పౌండ్లు) చొప్పున కోత విధిస్తారు. దీని ప్రకారం ఐపీఎల్‌లో స్టోక్స్ ఆడినన్ని రోజుల ప్రకారం డబ్బు వెనక్కి ఇవ్వాలి. స్టోక్స్ భారత్‌లో ఉండేందుకు అవకాశం ఉన్న 28 రోజులకు ఈ మొత్తం దాదాపు లక్ష పౌండ్లు (రూ. 84 లక్షలు) అవుతుంది. రూ.12 కోట్లు దక్కిం చుకున్న మరో ఇంగ్లండ్ ఆటగాడు టైమల్ మిల్స్ మాత్రం అన్ని ఫార్మాట్‌లలో ఆడే కాంట్రాక్ట్ ఉన్న ఆటగాడు కాకపోవడంతో అతనికి ఈ సమస్య లేదు.
అలారం పెట్టుకొని...
ఇటీవలి భారత్ పర్యటనలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తన సూపర్ షోతో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్–10 ఆటగాళ్ల వేలంలో తను హాట్‌కేకులా మారతాడని ముందే అందరూ ఊహించారు. అయితే ఇతడిపై ఏకంగా రూ.14.5 కోట్ల రికార్డు ధరను వెచ్చించి కొనుగోలు చేస్తారని మాత్రం అనుకోలేదు. నిజానికి ఈ ధర అటు స్టోక్స్‌ను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే ఇది ఇప్పటిదాకా ఓ విదేశీ ఆటగాడికి దక్కిన అత్యధిక మొత్తం. అటు ఈ వేలాన్ని చూసేందుకు తెల్లవారుజామున 3.30 గంటలకే అలారం పెట్టుకుని లేచానని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఆడబోతున్న స్టోక్స్ తెలిపాడు. ‘వేలం కోసం ఉత్సాహంగా తెల్లవారే అలారం పెట్టుకుని లేచాను. నా వంతు వచ్చేవరకు 40 నిమిషాలసేపు ఓపిగ్గా ఎదురుచూశాను. అయితే టీవీలో ప్రత్యక్షంగా చూడలేకపోయాను. అందుకే ట్విట్టర్‌లో ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు ట్వీట్స్‌ను అప్‌డేట్ చేస్తుంటే తెలిసింది.. నన్ను పుణే జట్టు తీసుకుందని. నా కనీస ధరకు ఏడు రెట్లు ఎక్కువగా లభించడంతో ఆశ్చర్యపోయాను. దీనిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నిజంగా ఇది జీవితాన్ని మార్చే మొత్తం. ఇంతకుమించి ఆశించలేను. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు. అయితే నా ధరకు తగ్గట్టుగా ఆడి జట్టుకు విజయాలు అందించాలనుకుంటున్నాను’ అని స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు.