‘స్టువర్ట్‌ బ్రాడ్‌లా ఫీలయ్యా..అవునా?!’ | Stuart Broad Reaction For Yuzvendra Chahal Comments On Yuvraj Singh Sixes | Sakshi
Sakshi News home page

‘స్టువర్ట్‌ బ్రాడ్‌లా ఫీలయ్యా..అవునా?!’

Published Sat, Mar 30 2019 10:53 AM | Last Updated on Sat, Mar 30 2019 4:20 PM

Stuart Broad Reaction For Yuzvendra Chahal Comments On Yuvraj Singh Sixes - Sakshi

బెంగళూరు : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించిన సంగతి తెలిసిందే. క్రీజులో ఉన్నది కాసేపు అయినా ఆర్సీబీకీ ముఖ్యంగా స్పిన్నర్‌ చహల్‌కు చెమటలు పట్టించాడు. ఈ విషయం గురించి మ్యాచ్‌ అనంతరం చహల్‌ మాట్లాడుతూ... ‘ యువరాజ్‌ నా బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టిన తర్వాత స్టువర్ట్‌ బ్రాడ్‌లా ఫీలయ్యాను. అయితే యువీ ఓ లెజండరీ బ్యాట్స్‌మెన్‌ అని నాకు తెలుసు. పైగా అది చిన్న స్టేడియం. కాబట్టి బంతిని సులభంగా బౌండరీ దాటించవచ్చు. అయినా నా వరకు నేను బాగానే బౌలింగ్‌ చేశా అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు.

ఈ నేపథ్యంలో చహల్‌ తనతో పోల్చుకోవడాన్ని గురించి ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్ స్పందించాడు. ‘ పదేళ్లలో 437 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా చహల్‌ ఫీల్‌ అవ్వాలని ఆశిస్తున్నా’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా 2007 ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ సందర్భంగా స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌ను యువీ చీల్చి చెండాడిన సంగతి తెలిసిందే. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టి అతడికి చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ఇది తన కెరీర్‌లోనే చెత్త ప్రదర్శన అంటూ బ్రాడ్‌ పలుమార్లు పేర్కొన్నాడు.

ఇక గురువారం నాటి మ్యాచులో 14 వ ఓవర్లో చహల్‌ బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్లతో అలరించిన యువీ.. నాల్గో బంతికి సైతం భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌ చేరాడు. బౌండరీ లైన్‌వద్ద సిరాజ్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో యువరాజ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. కాగా చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 6 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement