ధోనీ, రైనాలదే అధిక ధర
ముంబై: ముందు ఊహించినట్లుగానే టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తాజా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) వేలంలో అత్యధిక ధర పలికాడు. తొలుత రూ.12.5 కోట్లకు మహేంద్ర సింగ్ ధోనిని పుణె ప్రాంఛైజీ కొనుగోలు చేయగా, అనంతరం సురేష్ రైనాను అదే ధరకు రాజ్ కోట్ దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో ధోని, రైనాలే ముందుగా అమ్ముడుపోయి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. కాగా, రవీంద్ర జడేజాను రూ.9.5 కోట్లకు రాజ్ కోట్ దక్కించుకుంది.
చెన్నై, రాజస్తాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో వచ్చిన కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్ జట్లు మంగళవారం పదిమంది క్రికెటర్లను ఎంచుకోవడంతో వేలం ప్రక్రియ ముగిసింది. చెన్నై, రాజస్తాన్ జట్లకు గత సీజన్‌లో ఆడిన మొత్తం 50 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండగా... నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లను మాత్రమే ఇప్పుడు ఎంచుకోవాల్సిఉంది. ఇంకా మిగిలిన 40 మంది క్రికెటర్లు ఫిబ్రవరిలో జరిగే వేలంలోకి వెళతారు. అక్కడ వీరితో పాటు మరింత మంది క్రికెటర్లు ఉంటారు. ఆ వేలంలో అన్ని జట్లూ పాల్గొంటాయి.
సంజీవ్ గోయెంకాకు చెందిన కంపెనీ రివర్స్ బిడ్డింగ్ ప్రక్రియలో మైనస్ 16 కోట్ల రూపాయలతో జట్టును పుణేను గెలిచింది. రాజ్‌కోట్‌ను కొనుక్కున్న ఇంటెక్స్ మొబైల్స్ (మైనస్ 10 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ మొత్తం పుణే జట్టు చెల్లిస్తోంది. కాబట్టి తొలి ఆటగాడిని పుణే ఎంచుకోగా, రెండో క్రికెటర్‌ను రాజ్‌కోట్ దక్కించుకుంది.
పుణె ప్రాంఛైజీ ఆటగాళ్లు..
ధోని(రూ.12.5 కోట్లు), అజింక్యా రహానే(రూ.9.5 కోట్లు), అశ్విన్(రూ.7.5 కోట్లు),స్టీవ్ స్మిత్(రూ.5.5 కోట్లు), డు ప్లెసిస్(రూ. 4 కోట్ల)
రాజ్ కోట్ ప్రాంఛైజీ ఆటగాళ్లు
సురేష్ రైనా(రూ.12. 5 కోట్లు), జడేజా(9.5 కోట్లు), మెకల్లమ్(రూ.7.5 కోట్లు), ఫాల్కనర్(రూ.5.5 కోట్లు), డ్వేన్ బ్రేవో(రూ.4 కోట్లు)