సన్‌రైజర్స్‌లో రాంనగర్‌ కుర్రోడు | Sun Risers Hyderbad Select Ram Nagar Boy Sandeep in IPL2020 | Sakshi
Sakshi News home page

గల్లీ To ఐఢీఎల్‌

Published Fri, Dec 20 2019 7:48 AM | Last Updated on Fri, Dec 20 2019 7:48 AM

Sun Risers Hyderbad Select Ram Nagar Boy Sandeep in IPL2020 - Sakshi

గల్లీ చిన్నోడు బావనక సందీప్‌ దశ తిరగనుంది.  జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకునే అద్భుత అవకాశం మనోడికి దక్కింది.  దేశవాళీ టోర్నీల్లో మెరిపించిన ఈ భాగ్యనగరం కుర్రోడిపై గురువారం కనక వర్షం కురిసింది.  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలంలో సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ సందీప్‌ను సొంతం చేసుకుంది.  వీవీఎస్‌ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్‌ లాంటి దిగ్గజాల మార్గదర్శకత్వంలో, కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ప్రోత్సాహంతో సందీప్‌ ప్రొఫెషనల్‌ కెరీర్‌ మరింత ఉజ్వలంగా మారనుంది. బేస్‌ ప్రైజ్‌కే (ప్రాథమిక ధర) ‘సన్‌’ చెంత చేరిన ఈ హైదరాబాదీ సొంత ప్రేక్షకుల మద్దతుతో ఐపీఎల్‌లోచెలరేగాలని ఉత్సాహంగాఎదురుచూస్తున్నాడు.

ముషీరాబాద్‌: తండ్రి త్యాగానికి ఆ కుర్రాడు న్యాయం చేశాడు. రాంనగర్‌ గల్లీల్లో బ్యాట్‌ పట్టుకు తిరిగిన ‘బావనక సందీప్‌’ ఐపీఎల్‌కు ఎంపికై మధ్య తరగతి కుటుంబం నుంచి మరో కలికితురాయిగా నిలిచాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో జరిగిన వేలంలో నగరం నుంచి సిరాజ్‌ స్థానం సంపాదించుకోగా.. ఈ సీజన్‌లో సందీప్‌ చోటు దక్కించుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు. కోల్‌కతాలో గురువారం ఐపీఎల్‌–2020 సీజన్‌కు జరిగిన క్రికెట్‌ క్రీడాకారుల వేలంలో సందీప్‌ను రూ.20 లక్షల బేస్‌ ప్రైజ్‌కు సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం దక్కించుకుంది. ప్రస్తుతం సందీప్‌ పంజాబ్‌లో రంజీ మ్యాచ్‌ ఆడుతున్నాడు. తమ ప్రాంతం కుర్రాడికి ఐపీఎల్‌లో అవకాశం దక్కడంతో రాంనగర్‌లోని వైఎస్సార్‌ పార్కు సమీపంలోని సందీప్‌ నివాసం స్థానికులు, అభిమానుల కోలాహలంగా మారిపోయింది. కాగా, సందీప్‌ 2010లో తన 18 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్‌లో రంగప్రవేశం చేసి తన మొదటి మ్యాచ్‌లోనే జార్ఖండ్‌పై సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 75 ఏళ్ల హైదరాబాద్‌ రంజీ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 5వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 54 రంజీ మ్యాచ్‌లు ఆడి 48.5 సగటుతో తన ప్రతిభను అజేయంగా కొనసాగిస్తున్నాడు. అతడి కెరీర్‌లో మొత్తం 7 సెంచరీలు, ఒక డబుల్‌ సెంచరీ, 21 హాఫ్‌ సెంచరీలు తన ఖాతాలో జమచేసుకున్నాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ అయిన సందీప్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ రంజీ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఇతడు బీటెక్‌ పూర్తిచేసి స్పోర్ట్స్‌ కోటాలో ఇన్‌కం ట్యాక్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సంపాదించాడు. 

కలిసొచ్చిన అవకాశం  
ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ఆలిండియా టీ–20 టోర్నమెంట్‌లో సందీప్‌ తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ మంత్రముగ్ధులను చేసి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్‌లో ఇతడు 7 ఇన్నింగ్స్‌ ఆడి 261 పరుగులు సాధించగా, అందులో 4 ఇన్సింగ్స్‌లో నాటౌట్‌గా నిలవడం గమనార్హం. ఐపీఎల్‌ మ్యాచ్‌లలో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉండగా అందుకు తగ్గట్టుగానే ముస్తాక్‌ అలీ టోర్నమెంట్‌లో తన ఆటతీరు ప్రదర్శించాడు. అందులో 43 బంతుల్లో 74 పరుగులు (నాటౌట్‌), 31 బంతుల్లో 51 పరుగులు (నాటౌట్‌), 27 బంతుల్లో 35 పరుగులు(నాటౌట్‌), 16 బంతుల్లో 41 పరుగులు(నాటౌట్‌)గా నిలిచి సత్తాచాటాడు. ఇదే మ్యాచ్‌లో మొత్తం 14 ఫోర్లు, 15 సిక్సర్లు కొట్టి ‘ఔరా’ అనిపించాడు. ఈ లీగ్‌ గ్రూప్‌లో ఆలిండియా స్థాయిలో పరుగుల్లో, సిక్సర్లలో రెండో స్థానంలో నిలవడం అతని ప్రతిభకు నిదర్శనం. ఈ మ్యాచ్‌లో సందీప్‌ ప్రదర్శన చూసిన ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు అయిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్‌ రాయల్స్‌ సందీప్‌ను ట్రయల్స్‌కు పిలవడం గమనార్హం. 

కొడుకు కోసం తండ్రి సర్వీస్‌ త్యాగం
రాంనగర్‌లోని వైఎస్సార్‌ పార్కు సమీపంలో నివసించే బావనక పరమేశ్వర్‌ తన 19వ ఏటనే భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)లో టెక్నీషియన్‌గా ఉద్యోగంలో చేరారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే బీడీఎల్‌ తరఫున 1978 నుంచి 1990 వరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో లీగ్‌ మ్యాచ్‌లను ఆడారు. 1990 నుంచి 2000 వరకు హెచ్‌సీఏ తరఫున క్రికెట్‌ మ్యాచ్‌లకు అంపైరింగ్‌ చేశారు. తన కుమారుడిని కూడా క్రికెటర్‌గా చూడాలని ఆశపడ్డ పరమేశ్వర్‌ కొడుకుకు ఐదేళ్ల వయసు నుంచే తానే గురువుగా క్రికెట్‌ ఓనమాలను దిద్దించాడు. ఓ పక్క ఉద్యోగం చేస్తూనే ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటి పక్కనే ఉన్న గ్రౌండ్‌లో రోజూ క్రికెట్‌లో కొడుకు సందీప్‌కు మెళకువలు నేర్పేవారు. అయితే, ఈ సమయం సరిపోదని, తన బిడ్డ పూర్తిస్థాయి క్రికెటర్‌ కావాలంటే మరింత సమయాన్ని వెచ్చించాలని భావించారు. ఒకటి సాధించాలంటే మరొకటి వదులుకోవాలి. దీంతో తన కొడుకును ఉన్నతమైన క్రికెటర్‌గా చూడాలని నిర్ణయించుకున్న పరమేశ్వర్‌ తన ఎనిమిదేళ్ల సర్వీసును వదులుకున్నారు. ఈ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు వ్యతిరేకించినా వినకుండా వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి పూర్తి సమయాన్ని సందీప్‌ శిక్షణ కోసమే వెచ్చించారు. వివిధ ప్రాంతాలలో జరిగే క్రికెట్‌ పోటీలకు కొడుకును తీసుకెళ్లడం, కోచింగ్‌ ఇప్పించడం, పక్కనే ఉంటూ మెళకువలు చెప్పడం, తప్పొప్పులను సరిదిద్దడం చేశారు. ముఖ్యంగా బేసిక్‌గా రైట్‌ హ్యాండెడ్‌ అయిన సందీప్‌ను లెఫ్ట్‌ హ్యాండర్‌గా తీర్చిదిద్దారు పరమేశ్వర్‌. దాంతోపాటు బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా బౌలింగ్‌లోనూ తర్ఫీదునిచ్చారు. ఎంతో శ్రమకోర్చి ఆస్ట్రేలియా, ఇంగ్లడ్‌ కౌంటీల్లో ఆడేందుకు పంపించారు.  

ప్రతిభను గుర్తించిన కోచ్‌ జాన్‌ మనోజ్‌
కొడుకును క్రికెటర్‌ చేయాలనే లక్ష్యంతో తండ్రి పరమేశ్వర్‌ నాలుగో తరగతి చదువుతున్న సందీప్‌ను ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని సెయింట్‌ జాన్స్‌ క్రికెట్‌ అకాడమీలో చేర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా ఈ సెంటర్‌లోనే సందీప్‌కు కోచ్‌ జాన్‌ మనోజ్‌ క్రికెట్‌ నేర్పిస్తున్నారు. ఏడేళ్ల వయసులో ఉన్న సందీప్‌ క్రికెట్‌ ప్రతిభను గుర్తించిన కోచ్‌ ఈ అకాడమీకే చెందిన పాఠశాల సెయింట్‌ ఆండ్రూస్‌లో స్పోర్ట్స్‌ కోటాలో ప్రవేశం కల్పించాలని ప్రిన్సిపల్‌కు సిఫారసు చేశారు. అందుకు ప్రిన్సిపల్‌ నిరాకరించడంతో ఈ బుడతడు భవిష్యత్‌లో రాష్ట్ర, దేశస్థాయిలో క్రికెట్‌ ఆడే సత్తా ఉందని, నా మీద నమ్మకంతో అడ్మిషన్‌ ఇవ్వాలని గట్టిగా కోరడంతో ప్రిన్సిపల్‌ అంగీకరించి 10వ తరగతి వరకు రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉచిత విద్యనందించారు. గురువారం సందీప్‌ ఐపీఎల్‌కు సెలక్ట్‌ కావడం పట్ల కోచ్‌ జాన్‌ మనోజ్‌ హర్షం వ్యక్తం చేస్తూ సందీప్‌లో క్రమశిక్షణ, పట్టుదల మెండుగా ఉన్నాయని, అతడికి బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి ప్రతిభ ఉందని, అతన్ని బెంచ్‌కే పరిమితం చేయకుండా అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తాడని ధీమా వ్యక్తం చేశారు.

తండ్రి త్యాగానికి కొడుకు గుర్తింపు  
రంజీల్లో 2010లో జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులకే హైదరాబాద్‌ ఆటగాళ్లంతా ఔటవడంతో సెలక్టర్ల దృష్టి యువ క్రిడాకారులపై పడింది. అపుడప్పుడే తండ్రి శిక్షణలో రాటుదేలుతున్న సందీప్‌ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. దీంతో 2010లో 18 ఏళ్ల వయసులో రంజీ మ్యాచ్‌కు ఎంపికై మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి సెలక్టర్ల ఎంపిక సరైందేనని నిరూపించాడు. 75 సంవత్సరాల హైదరాబాద్‌ క్రికెట్‌ చరిత్రలో మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన 5వ ప్లేయర్‌గా సందీప్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. గత ఐపీఎల్‌ వేలంలో కూడా సందీప్‌ పేరున్నా ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. అయితే, ఈ రాంనగర్‌ కుర్రాడు నిరాశ చెందక తన ఆటను మరింత మెరుగుపరుచుకుని 2020 ఐపీఎల్‌లో స్థానం దక్కించుకోవడంతో ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వన్‌ డే, ఐపీఎల్‌లో ఏనాటికైనా సెలెక్ట్‌ కాకపోతాడా..! తన కల నెరవేరకపోతుందా..! తన కృషికి తగిన ఫలితం లభించకపోతుందా..!! అనుకున్న తండ్రి పరమేశ్వర్‌ స్వప్నాన్ని కొడుకు సందీప్‌ నిజం చేశాడు. 

ఆనందంగా ఉంది
నేను ఏం కోరుకున్నానో నా బిడ్డ అదిసాధించాడు. చాలా ఆనందంగా ఉంది. సందీప్‌ను క్రికెటర్‌గా చూడాలని నాసర్వీసును కూడా వదులుకున్నాను.నా పదేళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కిందనుకుంటున్నా. నా బిడ్డకు ఆల్‌ రౌండర్‌గా ప్రతిభ ఉంది. భారత జట్టులో ఆడే అవకాశం దక్కాలని కోరుకుంటున్నా.– పరమేశ్వర్, ఉమారాణి(సందీప్‌ తల్లిదండ్రులు)  

సందీప్‌ @బీటెక్‌
సందీప్‌ మూడో తరగతి వరకు రాంనగర్‌లోని మదర్స్‌ హైస్కూల్‌లో చదువుకున్నాడు. 4నుంచి 10వ తరగతి వరకు ఈస్ట్‌ మారేడ్‌పల్లిలోని సెయింట్‌ ఆండ్రూస్‌ హైస్కూల్‌లో, ఇంటర్‌ అదే ప్రాంతంలోని సెయింట్‌ జాన్స్‌ జూనియర్‌ కళాశాలలో, బీటెక్‌ తీగల కృష్ణారెడ్డిఇంజినీరింగ్‌కళాశాలలోపూర్తిచేశాడు.

అద్భుత అవకాశం
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎంపికకావడం చాలా ఆనందంగా ఉంది. 60 రోజుల పాటు సాగే ఈ మెగా టోర్నమెంట్‌లో వార్నర్,విలియమ్సన్, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో పాటుహేమాహేమీలతో కలిసుండే అద్భుత అవకాశం దక్కింది. ఈ ప్రయాణంలో వారి అనుభవాలను తెలుసుకునే అవకాశముంది. ఆల్‌రౌండర్‌ని అయినప్పటికీ ప్రధానంగా బ్యాటింగ్‌ మీదే దృష్టి పెడతా. ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ–20 టోర్నమెంట్‌లో నా ఆటతీరుతోనే ఈ అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు అంబటి రాయుడు ఎంతో సహాయం చేసి ఆటలో మెళకువలను నేర్పించాడు. అతడికి, నన్నుసన్‌రైజర్స్‌కు ఎంపిక చేసిన లక్ష్మణ్‌కు కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌లో ఓనమాలు నేర్పించిన మా నాన్నకు, కోచ్‌ జాన్‌ మనోజ్‌కుఎల్లవేళలా రుణపడి ఉంటాను.– బావనక సందీప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement