న్యూఢిల్లీ : కపిల్‌దేవ్.. సునీల్ గవాస్కర్.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేర్లు. ఒకరు వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా, మరొకరు వరల్డ్ టాప్ క్లాస్ బ్యాట్సమెన్‌గా పేర్లు గడించారు.1980వ దశకంలో భారత క్రికెట్‌ను కొత్త పుంతలు తొక్కించారు ఈ ఇద్దరు ఆటగాళ్లు. ముఖ్యంగా టీమిండియా 1983 వరల్డ్‌కప్ సాధించడంలో వీరి పాత్ర మరువలేనిది. వ్యక్తిగతంగా ఎన్నో మైలురాళ్లను అధిగమించిన కపిల్, గవాస్కర్‌లు టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించి అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో చిరస్మరణీయ విజయాలు సాధించిపెట్టారు. ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే జట్టును సమర్థంగా నడిపించిన ఈ ఇద్దరి మధ్య అప్పట్లో విబేదాలు ఉన్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. తాజాగా స్పోర్ట్‌స్టార్ కాలమిస్ట్‌గా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ ఇవన్నీ ఒట్టి పుకార్లేనని కొట్టిపారేస్తూ ఒక కథనాన్ని రాసుకొచ్చారు.
1984-85లో డేవిడ్ గ్రోవర్ నేతృత్వంలోని అప్పటి ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. అప్పటి భారత జట్టుకు తానే కెప్టెన్‌గా వ్యవహరించినట్లు తెలిపారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ను గెలుచుకున్నాయి. జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల్లో కపిల్ మంచి ప్రదర్శన చేసినా కోల్‌కతా వేదికగా జరిగిన మూడో టెస్టులో అతనికి చోటు దక్కకపోవడం వివాదాస్పదంగా మారింది. ఆ మ్యాచ్ డ్రా అయినా నాలుగో టెస్టులో ఓడి సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించింది. జట్టులో అద్భుత ప్రదర్శన చేసినా కపిల్‌కు చోటు దక్కకపోవడంలో కెప్టెన్ సునీల్ గవాస్కర్ కీలకపాత్ర పోషించినట్లు అప్పట్లో చాలా కథనాలు వెలువడ్డాయి. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనని తన కాలమ్‌లో చెప్పుకొచ్చారు సునీల్ గవాస్కర్. అప్పటి భారత జట్టు సెలక్షన్ కమిటీకి దివంగత హనుమంత్ సింగ్ అధ్యక్షత వహించేవారని పేర్కొన్నారు. ఎవర్ని ఆడించాలో నిర్ణయించే హక్కు తనకు లేదని, హనుమంత్ సింగ్ సూచనల మేరకే కపిల్‌ను తప్పించినట్లు తెలిపారు. అంతేకానీ తనకు, కపిల్‌కు ఎలాంటి విభేదాలు లేవని తన కాలమ్‌లో స్పష్టం చేశారు.
లిటిల్ మాస్టర్‌గా పేరు పొందిన సునీల్ గవాస్కర్ టెస్టుల్లో 10వేల పరుగులు సాధించిన తొలి టెస్టు బ్యాట‍్సమెన్‌గానే గాక, టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు(34) సాధించిన ఆటగాడిగా రికార్డులెక్కారు. తరువాతి కాలంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గవాస్కర్ రికార్డులను తిరగరాసిన సంగతి మనందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment