'భారత్ కు మరో వైట్ వాష్ కష్టమే'
దంబుల్లా: శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి మంచి ఊపు మీద ఉన్న భారత జట్టుకు మరో వైట్ వాష్ లభించడం కాస్త కష్టమే అంటున్నాడు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. భారత్ తో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్ లో శ్రీలంక మెరుగ్గా రాణిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో భారత్ కు మరో క్లీన్ స్వీప్ రావడం అంత ఈజీ కాదని అభిప్రాయపడ్డాడు.
'భారత్ 4-1 తేడాతో వన్డే సిరీస్ ను సాధిస్తుందని అనుకుంటున్నా. వన్డే క్రికెట్ లో లంకేయలు ఆశించిన స్థాయిలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంక ఆటగాడు ఉపుల్ తరంగా వన్డేల్లో ప్రమాదకరమైన ఆటగాడు. అతనికి వన్డేల్లో మంచి రికార్డే ఉంది. ఆతిథ్య భారత్ జట్టుకు అతను సవాల్ గా నిలిచే అవకాశాలు లేకపోలేదు' అని గవాస్కర్ జోస్యం చెప్పాడు. అయితే బౌలింగ్ విషయంలో లంకేయులు చాలా బలహీనంగా ఉన్నారన్నాడు. అసలు భారత బ్యాటింగ్ లైనప్ కు లంక బౌలింగ్ ఎంతమాత్రం సరితూగదని గవాస్కర్ తెలిపాడు.