ఫామ్ కాదు.. హెయిర్ స్టైల్ నచ్చాలి: గావస్కర్
కొలంబో:శ్రీలంక పర్యటనలో భారత జట్టు ప్రదర్శనపై అభినందనలు కురిపిస్తున్న దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్.. బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీరుపై మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. లంక పర్యటనకు పలువురు కీలక ఆటగాళ్లను పక్కకు పెట్టడంపై గావస్కర్ సెటైర్లు గుప్పించారు.. ఇక్కడ ఆటగాళ్ల ఫామ్ కంటే కూడా వారి హెయిర్ స్టైల్ బాగుంటేనే జట్టులో ఎంపిక చేస్తారేమో అంటూ ఛలోక్తులు విసిరారు.'శ్రీలంక పర్యటనలో పలువురు ప్రధాన ఆటగాళ్లను పరీక్షించాల్సి ఉన్నా వారిని పట్టించుకోలేదు. ఇక్కడ వారి ఫామ్ కంటే కూడా హెయిర్ నచ్చాలేమో. ఎవరైతే వైవిధ్యమైన హెయిర్ స్టైల్ తో ఉంటారో వారినే జట్టులో ఎంపిక చేస్తారేమో. శ్రీలంకతో సిరీస్ కు ఆటగాళ్ల సెలక్షన్ ముగిసిపోయిన అధ్యాయమే. కాకపోతే చాలా మంది ఆటగాళ్లను పరీక్షించాల్సి ఉన్నా కనీసం వారిని ఎంపిక చేయలేదు. జట్టులో ఎంపిక కావాలంటే ఆయా ఆటగాళ్లు ఇక నుంచి భిన్నమైన హెయిర్ స్టైల్ తో కనిపించడం మొదలు పెట్టండి. ఆటగాళ్ల ఫామ్ కంటే కూడా హెయిర్ స్టైల్ ముఖ్యంగా కనిపిస్తుంది'అని ఓ జాతీయ పత్రికకు రాసిన కాలమ్ లో గవాస్కర్ మండిపడ్డారు.
లంక పర్యటనలో హార్దిక్ పాండ్యా భిన్నమైన హెయిర్ స్టైల్ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం మధ్యలో మాత్రమే హెయిర్ ను ఉంచి చుట్టూ పూర్తి షేవ్ తో తనదైన మార్కును చూపించే యత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంచితే, వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని పరిమిత ఓవర్ల జట్టును ఎంపిక చేశామని చెబుతున్న సెలక్టర్లు కీలక ఆటగాళ్లు యువరాజ్ సింగ్, సురేశ్ రైనాలను పక్కకు పెట్టింది. మరొకవైపు లంక పర్యటనలో అజింక్యా రహానే ఇప్పటివరకూ ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఈ క్రమంలోనే గావస్కర్ తన పదునైన వ్యాఖ్యలతో సెలక్షన్ కమిటీకి చురకలంటించినట్లు కనబడుతోంది.