నాలుగు రోజుల్లోనే ముగుస్తుందేమో!
సునీల్ గావస్కర్
తొలి టెస్టు గెలిచిన ఉత్సాహంతో ఉన్న భారత్ రెండో టెస్టుకూ సర్వసన్నద్ధమైంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌నెస్‌ను సంతరించుకున్నాడు. దీంతో రాహుల్‌కు తుది జట్టులో స్థానం కోసం తొలి టెస్టులో మెరుగ్గా ఆడిన మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్‌ను పెవిలియన్‌కు పరిమితం చేయాలా? లేదంటే ఒక బౌలర్‌ను తగ్గించాలా? లేక ఎలాంటి మార్పులు చేయకుండా గెలిచిన జట్టునే ఈ మ్యాచ్‌కూ కొనసాగించాలా? అనేది కోహ్లికి సమస్యగా మారింది. తొలి టెస్టులో శిఖర్ ధావన్ తొలి రోజే అద్వితీయ బ్యాటింగ్‌తో లంక నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.
మరోవైపు గత రెండేళ్లుగా భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు చతేశ్వర్ పుజారా వెన్నెముకగా ఉన్నాడు. తాను క్రీజులో ఉంటే మరో ఎండ్‌లోని బ్యాట్స్‌మెన్ ఎలాంటి ఒత్తిడికిలోనుకాకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని పుజారా కల్పిస్తాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ పోషించిన పాత్రను ఇప్పుడు పుజారా నిర్వర్తిస్తున్నాడు. ద్రవిడ్ మాదిరిగానే పుజారాకు కూడా సరైన గుర్తింపు లభించడంలేదని చెప్పాలి. తొలి వికెట్ పడగానే క్రీజులోకి వచ్చినపుడు పుజారా కుదురుగా ఆడి ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తాడు. పుజారాను అవుట్ చేయాలనే ఉద్దేశంతో బౌలర్లు ప్రయోగాలకు పోయి తమ లయను కోల్పోతుంటారు. భారత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌తో పుజారా కూడా లాభపడ్డాడు. తాను అవుటైతే మిగతా బ్యాట్స్‌మెన్‌కు భారీ స్కోరు అందించే సత్తా ఉందనే నమ్మకంతో పుజారా తన ఆటతీరులో జోరు పెంచుతుంటాడు.
కెరీర్‌లో 50వ టెస్టు ఆడబోతున్న పుజారా తనకెంతో ప్రత్యేకమైన మ్యాచ్‌లో మరో గొప్ప ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా తన అరంగేట్రం టెస్టులోనే ఆకట్టుకున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అయితే కోహ్లి మాత్రం టాప్ బ్యాట్స్‌మెన్ అవుటయ్యాకే పాండ్యాకు బౌలింగ్ ఇవ్వాలని భావిస్తున్నాడు. పాండ్యా ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాల్సి వస్తే అతనికి మరిన్ని ఓవర్లు బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాలి. లేదంటే పాండ్యా స్థానంలో స్పెషలిస్ట్ బౌలర్‌ను తది జట్టులోకి తీసుకోవాలి.
ఇక ఆతిథ్య శ్రీలంక జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. భారత్‌కు సవాల్ విసరాలంటే శ్రీలంక ఆటతీరు ఎంతో మెరుగు పడాలి. కెప్టెన్ దినేశ్ చండిమాల్, లాహిరు తిరుమన్నేల రాకతో లంక మిడిల్ ఆర్డర్ కాస్త పటిష్టమైంది. అయితే ఓపెనర్లు శుభారంభం ఇవ్వాల్సిన అవసరముంది. తొలి టెస్టులో నువాన్ ప్రదీప్ ఆరు వికెట్లు తీసుకున్నా మిగతా బౌలర్లు విఫలమయ్యారు. నిజం చెప్పాలంటే భారత్ 20 వికెట్లు తీసే సత్తా లంక బౌలింగ్‌లో కనిపించడం లేదు. భారత్ మరీ చెత్తగా ఆడితే తప్ప ఈ మ్యాచ్‌లోనూ లంకకు కష్టాలు తప్పవు. ప్రస్తుతం భారత్ జోరు చూస్తుంటే రెండో టెస్టు కూడా నాలుగు రోజుల్లోనే ముగిసేలా అనిపిస్తోంది.