న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామానికి తెరపడింది. 27 ఏళ్ల తర్వాత ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు మళ్లీ స్వర్ణం లభించింది. మంగళవారం మొదలైన ఈ మెగా ఈవెంట్‌లో తొలి రోజు గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక కాంస్యం లభించాయి. పురుషుల 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ పసిడి పతకం నెగ్గగా... 55 కేజీల విభాగంలో అర్జున్ హలకుర్కి కాంస్యం సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో సునీల్ 5–0తో అజత్ సలిదినోవ్ (కిర్గిస్తాన్)పై గెలిచాడు. తద్వారా పప్పూ యాదవ్ (1993లో; 48 కేజీలు) తర్వాత ఆసియా రెజ్లింగ్ పోటీల్లో గ్రీకో రోమన్ శైలిలో భారత్‌కు స్వర్ణాన్ని అందించిన రెజ్లర్‌గా సునీల్ గుర్తింపు పొందాడు. సెమీఫైనల్లో సునీల్ 12–8తో అజామత్ కుస్తుబయేవ్ (కజకిస్తాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 8–2తో తకహిరో సురుడా (జపాన్)పై నెగ్గాడు. మరోవైపు 55 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కర్ణాటక రెజ్లర్ అర్జున్ 7–4తో డాంగ్‌హైక్ వన్ (దక్షిణ కొరియా)పై నెగ్గాడు. ఇతర విభాగాల్లో సచిన్ రాణా (63 కేజీలు), సజన్ భన్వాల్ (77 కేజీలు) విఫలమయ్యారు. 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో మెహర్ సింగ్ (భారత్) 2–3తో రోమన్ కిమ్ (కిర్గిస్తాన్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment