
'కచ్చితమైన ప్రణాళికలతో ఓడించాం'
సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని సాధించడానికి కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేయడమే కారణమని ఆ జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు.
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ముంబై ఇండియన్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయాన్ని సాధించడానికి కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేయడమే కారణమని ఆ జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ స్పష్టం చేశాడు. పటిష్టమైన ముంబై ఇండియన్స్ నిలువరించాలంటే అనవసర తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదనేది తమ వ్యూహంలో భాగమని, దాన్ని సన్ రైజర్స్ ఆటగాళ్లు సరిగ్గా అమలు చేయడంతోనే విజయం సాధ్యమైందన్నాడు.
'ముంబై ఇండియన్స్ చాలా మంచి జట్టు. దాంతో పాటు ఆ జట్టులోని ఆటగాళ్లంతా మంచి ఫామ్ లో ఉన్నారు. దాంతో కచ్చితమైన వ్యూహాలతో బరిలోకి దిగాం. బౌలర్లను పదే పదే మార్చాలని, ఆదిలో స్పిన్నర్లతో బౌలింగ్ చేయించాలనేది గేమ్ ప్లాన్ లో భాగం. పవర్ ప్లేలో స్పిన్నర్ మొహ్మద్ నబీ చేత బౌలింగ్ చేయించడం కూడా వ్యూహంలో భాగమే. అది సక్సెస్ అయ్యింది. తొలి రెండు, మూడు ఓవర్లే మ్యాచ్ కు కీలకం. అక్కడి కట్టడి చేసి ముందుగా ముంబై ఇండియన్స్ పై పైచేయి సాధించాం. ఆ తరువాత వారిని తిరిగి తేరుకోనీయకుండా ఒత్తిడి తెచ్చాం. ఓవరాల్ గా చెప్పాలంటే కచ్చితమైన ప్రణాళికల్ని అమలు చేయడంతోనే ముంబైపై విజయం సాధించాం' అని లక్ష్మణ్ తెలిపాడు.