
కోల్‌కతా: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తోంది. శనివారం ఇక్కడ జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (34 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేశాడు. భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి గెలిచింది. విలియమ్సన్ (44 బంతుల్లో 50; 4 ఫోర్లు, ఒక సిక్స్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా బ్యాటింగ్ సమయంలో 7 ఓవర్ల వద్ద వర్షం కురవడంతో ఆటకు అంతరాయం తప్పలేదు.
ఒకే ఒక్కడు... లిన్
మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్‌ను హైదరాబాద్ పేసర్లు సమష్టిగా దెబ్బతీశారు. దీంతో ఆరంభం నుంచి ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది. ఓపెనర్ క్రిస్ లిన్ ఒక్కడే బాధ్యతగా ఆడాడు. రాబిన్ ఉతప్ప (3), నరైన్ (9), శుభ్‌మన్ గిల్ (3), శివమ్ మావి (7) ఇలా క్రీజ్‌లోకి ఎవరొచ్చినా... కుదురుగా ఆడేవారే కరువయ్యారు. లిన్‌తో కలిసి కాసేపు నితీశ్ రాణా (16 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దినేశ్ కార్తీక్ (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారు. ఈ ముగ్గురు మినహా ఇంకెవరూ రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. పేసర్లు భువనేశ్వర్ (3/26), స్టాన్‌లేక్ (2/21)లతో పాటు ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ (2/21) తన స్పిన్‌తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కట్టడి చేశాడు.
విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్...
కష్టసాధ్యం కాని లక్ష్యమే అయినా... ధాటిగా ఆడిన సాహా (15 బంతుల్లో 24; 5 ఫోర్లు)తో పాటు కీలక ఓపెనర్ ధావన్ (7), కుదురుగా ఆడే మనీశ్ పాండే (4)లు తక్కువ స్కోరుకే నిష్క్రమించారు. దీంతో బ్యాటింగ్ భారం పూర్తిగా కెప్టెన్ విలియమ్సన్‌పైనే పడింది. 55 పరుగులకే టాపార్డర్ వికెట్లను కోల్పోయిన ఈ దశలో విలియమ్సన్, షకీబుల్ హసన్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. జట్టు స్కోరు 114 పరుగుల వద్ద షకీబ్, 5 పరుగుల వ్యవధిలో విలియమ్సన్ ఔటైనప్పటికీ మిగతా లాంఛనాన్ని యూసుఫ్ పఠాన్ (7 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ హుడా (5 నాటౌట్) పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment