సన్‌రైజర్స్ కు ఇద్దరే
ముంబై: ఐపీఎల్-7 కోసం హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించుకుంది. ధావన్‌తో పాటు స్టెయిన్‌ను రైజర్స్ తమ వద్దే అట్టి పెట్టుకుంది. ఈ ఇద్దరు ఆటగాళ్లను కొనసాగించేందుకు ఆ టీమ్ రూ. 22 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్-2014 కోసం వచ్చే నెల 12, 13 తేదీల్లో బెంగళూరులో వేలం జరగనుంది. చెన్నై, ముంబై జట్లు ఊహించిన విధంగానే కీలక ఆటగాళ్లను కొనసాగించాయి.
ముంబై ఐదో ఆటగాడిగా దినేశ్ కార్తీక్‌తో పోటీ ఎదురైనా తెలుగు కుర్రాడు అంబటి తిరుపతి రాయుడుకు అవకాశం దక్కింది. ఒక్క ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మాత్రం ఏ ఒక్క ఆటగాడినీ అట్టి పెట్టుకోలేదు. వీరేంద్ర సెహ్వాగ్ సహా ఎవరినీ కొనసాగించడానికి ఆ జట్టు ఇష్ట పడలేదు. గత సీజన్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ మిల్లర్‌తో పాటు వోహ్రాను పంజాబ్ జట్టు కొనసాగించింది. గత సీజన్‌లో 12 మ్యాచుల్లో 161 పరుగులు చేసిన వోహ్రాను కొనసాగించడం అనూహ్యమే. కోల్‌కతా, రాజస్థాన్ ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకోలేదు. ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ఆటగాళ్లలో బిన్నీ, శామ్సన్, వోహ్రా భారత జట్టుకు ఆడలేదు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు ఆటగాళ్ల కోసం గరిష్టంగా రూ.60 కోట్లు ఖర్చు చేయొచ్చు. జట్టులో సభ్యుల సంఖ్య కనిష్టంగా 16, గరిష్టంగా 27 మంది మాత్రమే ఉండాలి. ఇందులో విదేశీ ఆటగాళ్లు 9 మందికి మించకూడదు. ఆటగాళ్లను కొనసాగించుకునేందుకు ఖర్చయిన మొత్తాన్ని మినహాయించి, మిగిలిన డబ్బుతో ఫ్రాంఛైజీలు వేలానికి వెళతాయి.
ఆటగాళ్లకు ఎంత?
ఒక్క ఆటగాడిని కొనసాగిస్తే ఫ్రాంఛైజీ తమ వేలం మొత్తం నుంచి రూ.12.5 కోట్లు తగ్గించుకోవాలి. ఆ తర్వాత వరుసగా 9.5, 7.5, 5.5, 4 కోట్ల రూపాయల చొప్పున తర్వాతి ఆటగాళ్ల కోసం తగ్గించుకోవాలి. అయితే ఫ్రాంఛైజీ సదరు ఆటగాడికి ఇంతే మొత్తం చెల్లించాలని నిబంధన లేదు. జట్టుకు, ఆటగాడికి ఉన్న ఒప్పందం మేరకు ఎంత మొత్తమైనా చెల్లించొచ్చు. దీనితో ఐపీఎల్ కౌన్సిల్‌కు సంబంధం లేదు.
‘రైట్స్ టు మ్యాచ్’ కార్డ్ అంటే
2013 సీజన్‌లో తమకు ఆడిన ఆటగాడు వేలంలోకి వెళితే... వేలంలో అతడికి పలికిన ధరను ఇచ్చి పాత జట్టే తీసుకునే అవకాశం. ఉదాహరణకు... జాన్సన్‌ను ముంబై వేలంలోకి పంపించింది. వేలంలో జాన్సన్‌ను చెన్నై రూ. 5 కోట్లకు కొన్నది అనుకుందాం. అప్పుడు ముంబై అదే రూ.5 కోట్లు ఇచ్చి జాన్సన్‌ను తీసుకోవచ్చు.