
చిత్తయిన రాజులు
►పుణే అలవోకగా ప్లే–ఆఫ్‌కు...
►చిత్తుగా ఓడిన పంజాబ్
►సమష్టిగా రాణించిన పుణే బౌలర్లు
పుణే: హోరాహోరి తప్పదనుకున్న మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. తుదికంటా పోరాడాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ అరంభం నుంచే తడబడింది. కనీస బాధ్యతే లేకుండా బ్యాట్లేత్తేసింది. దీంతో రైజింగ్ పుణే చెమటోడ్చకుండానే ప్లే–ఆఫ్ చేరింది. ఆదివారం జరిగిన పోరులో బౌలర్లు సమష్టిగా రాణించడంతో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 15.5 ఓవర్లలో 73 పరుగుల వద్ద ఆలౌటైంది. అక్షర్ పటేల్ (22)దే అత్యధిక స్కోరు. శార్దుల్ ఠాకూర్ 3, ఉనాద్కట్, జంపా, క్రిస్టియాన్ తలా 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత పుణే 12 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 78 పరుగులు చేసి గెలిచింది. రహానే (34 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (20 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
73 పరుగులకే ఆలౌట్
టాస్ నెగ్గిన పుణే సారథి స్మిత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... బౌలర్లు తమ బౌలర్ నిర్ణయం సరైందని తొలి బంతినుంచే నిరూపించారు. వృద్ధిమాన్ సాహా (13)తో పంజాబ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన గప్టిల్ (0) ఉనాద్కట్ తొలిబంతికే డకౌట్ అయ్యాడు. తర్వాత శార్దుల్ ఠాకూర్, క్రిస్టియాన్ తలా ఒక దెబ్బతీయడంతో పవర్‌ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ (32/5) సగం వికెట్లను కోల్పోయింది. మార్‡్ష (10), మోర్గాన్ (4), రాహుల్ తెవాటియా (4), మ్యాక్స్‌వెల్ (0) ఇలా అందరూ ఆడేందుకు కాకుండా... వికెట్లు సమర్పించుకునేందుకే వరుస కట్టారు. తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ (22) కాస్త మెరుగనిపించినా... క్రిస్టియాన్ అతన్ని బోల్తాకొట్టించాడు. టెయిలెండర్లు మోహిత్ శర్మ (6), ఇషాంత్ శర్మ (1) జంపా ఔట్ చేయడంతో 73 పరుగుల వద్ద పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.
రాణించిన రహానే
సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పుణే ఓపెనర్లు అజింక్యా రహానే, రాహుల్ త్రిపాఠి నిలకడగా ఆడారు. తర్వాత స్పీడ్ పెంచిన త్రిపాఠి... ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, రాహుల్ తెవాటియా మరుసటి ఓవర్లో భారీ సిక్సర్‌తో అలరించాడు. ఇదే జోరులో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత కెప్టెన్ స్మిత్ (18 బంతుల్లో 15 నాటౌట్), రహానేకు జతయ్యాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఈ విజయంతో 18 పాయింట్లు పొందిన పుణే రెండో స్థానంలో నిలిచింది. 16న ముంబైతో జరిగే తొలి క్వాలిఫయర్‌లో తలపడనుంది. అందులో ఓడిన జట్టుకు ఫైనల్ చేరే అవకాశం రెండో క్వాలిఫయర్ రూపంలో సజీవంగా ఉంటుంది.