గవాస్కర్‌కు సుప్రీం ప్రశంస
‘బీసీసీఐ’ నుంచి తప్పుకోనున్న మాజీ కెప్టెన్
న్యూఢిల్లీ: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఆ బాధ్యతల నుంచి వైదొలగవచ్చని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో ఆయన కామెంటరీ తదితర వ్యవహారాల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఐపీఎల్-7ను ఎలాంటి వివాదం లేకుండా నిర్వహించినందుకు టీఎస్ ఠాకూర్, ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన బెంచ్ గవాస్కర్‌ను ప్రశంసించింది. అలాగే ఆయనకు ఇవ్వాల్సిన పరిహారంపై తగిన నివేదికను అందించాల్సిందిగా బీసీసీఐని కోర్టు ఆదేశించింది.
మరోవైపు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు శివలాల్ యాదవ్‌ను బోర్డు అధ్యక్ష బాధ్యతల్లో ఉండాల్సిందిగా బెంచ్ పేర్కొంది. స్పాట్ ఫిక్సింగ్‌పై విచారణ కొనసాగేంత వరకు ఎన్.శ్రీనివాసన్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశిస్తూ ఐపీఎల్-7 కోసం సునీల్ గవాస్కర్‌ను, ఇతర పాలనా వ్యవహారాల కోసం శివలాల్ యాదవ్‌ను కోర్టు నియమించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బీసీసీఐలో తన బాధ్యతల గురించి స్పష్టత ఇవ్వాలని సన్నీ కోర్టుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కోర్టు గవాస్కర్‌ను రిలీవ్ చేసింది. అలాగే సన్నీ ఈ పదవిలో ఉన్నన్నాళ్లు ఇతర వ్యాపకాల ద్వారా తాను కోల్పోయిన ఆదాయాన్ని నష్టపరిహారంగా బోర్డే చెల్లించాల్సి ఉంటుందని కోర్టు గతంలోనే పేర్కొంది.