మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో రైనా
కేప్‌టౌన్: ఏడాది తర్వాత భారత క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన టాపార్డర్ ఆటగాడు సురేశ్ రైనా.. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రైనా బ్యాట్ ఝుళిపించడంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 'భారత్ సిరీస్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన రైనా పునరాగమనం అదిరింది' అని మహ్మద్ కైఫ్ ట‍్వీట్ చేయగా, స్పెషల్ షూటౌట్‌తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన రైనాకు అభినందనలు' అని సచిన్ పేర్కొన్నాడు.
'రైనా అద్భుతంగా ఆడావు' అంటూ పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ట్వీట్ చేశాడు. ఇక భార్య ప్రియాంక కూడా రైనా ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు. ' నీ హృదయం భావోద్వేగంతో నిండిపోయి ఉంటుంంది. నీ కళ్లలో ఆనంద భాష్పాలు వర్షించి ఉంటాయి' అని ఆమె ట్వీట్ చేశారు. ఇలా పలువురు క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా రైనాకు అభినందలు తెలియజేస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నావంటూ ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ను ప్రశంసిస్తున్నారు.
సఫారీలతో మూడు టీ20ల సిరీస్ ద్వారా భారత జట్టులోకి తిరిగి ప్రవేశించిన రైనా..తన దైన మార్కు ఆటను చూపెట్టాడు. ప్రధానంగా చివరి టీ 20లో రైనా చెలరేగి ఆడాడు. 27 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్సర్ సాయంతో 43 పరుగులు సాధించాడు. విలువైన పరుగుల్ని రైనా నమోదు చేయడంతో భారత జట్టు 172 పరుగుల్ని సాధించి సఫారీలకు సవాల్ విసిరింది. మరొకవైపు బౌలింగ్‌లో సత్తా చాటుకున్నాడు. ఒకవైపు ప్రధాన బౌలర్లు భారీగా పరుగులిచ్చిన తరుణంలో రైనా మాత్రం పొదుపుగానే బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 27 పరుగులతో సరిపెట్టుకున్నాడు. డేవిడ్ మిల్లర్ వంటి ప్రమాదకర బ్యాట్స్‌మన్ వికెట్‌ను సైతం తన ఖాతాలో వేసుకుని భేష్ అనిపించాడు. ఇవన్నీ భారత విజయానికి బాటలు వేశాయి.
తొలి టీ20లో 7 బంతుల్లో 15 పరుగులు చేసిన రైనా.. రెండో టీ20లో 30 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన రైనా.. వచ్చీ రావడంతోనే సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి వారిని ఒత్తిడిలోకి నెట్టడంలో సక్సెస్ అయ్యాడు. అటు కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని, ఇటు సెలక్టర్ల నమ్మకాన్ని వమ్ము చేయని రైనా.. త్వరలో శ్రీలంకలో జరిగే ముక్కోణపు టీ20 సిరీస్‌లో కూడా చోటు దక్కించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment