
మళ్లీ టీమిండియాలోకి వస్తా
టీమిండియాలో మళ్లీ చోటు సంపాదిస్తానని మిడిలార్డర్ బ్యాట్స్మన్ సురేష్ రైనా ధీమా వ్యక్తం చేశాడు. కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ రాణిస్తానని చెప్పాడు. రైనా తన 11 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో తొలిసారి టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో చోటు కోల్పోయాడు. జింబాబ్వే టూర్కు సెలెక్టర్లు రైనాను ఎంపిక చేయని సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రైనా రాణించినా అతనికి టీమిండియాలో చోటు దక్కలేదు. కాగా అతనికి విశ్రాంతినిచ్చారా లేక పక్కనబెట్టారా అన్న విషయంపై రైనా క్లారిటీ ఇవ్వలేదు.
'సెలెక్షన్ నా చేతుల్లో లేదు. కెప్టెన్గా, ఆటగాడిగా రాణించా. నాకు కొంత విశ్రాంతి కావాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలెడతా. నాలో ఇంకా చాలా ఆట మిగిలుంది. 11 ఏళ్లుగా విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నా ఇప్పటికీ ఫిట్గా ఉన్నా. నేను తర్వాత ఆడే మ్యాచ్ సెప్టెంబర్లో ఉండొచ్చు. ప్రస్తుతం విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నా. ఓ బిడ్డకు తండ్రినయ్యాను. ఇదో కొత్త అనుభూతి. నా కూతురు, భార్యతో కలసి కొన్నాళ్లు నెదర్లాండ్స్లో గడుపుతా' అని రైనా అన్నాడు.