న్యూఢిల్లీ: ఊహించినట్టే భారత స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ కొత్త వెయిట్ కేటగిరీలకు మారారు. 2016 రియో ఒలింపిక్స్ క్రీడల్లో సుశీల్ కుమార్ 74 కేజీల విభాగంలో... యోగేశ్వర్ దత్ 65 కేజీల విభాగంలో పోటీపడతారు. ఇప్పటిదాకా సుశీల్ 66 కేజీల్లో... యోగేశ్వర్ 60 కేజీల్లో పాల్గొనేవారు. అయితే అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (ఫిలా) ఇటీవల వెయిట్ కేటగిరీలలో మార్పులు చేసింది. ఆ జాబితాలో వీరిద్దరి కేటగిరీలు లేకపోవడంతో కొత్త విభాగాలకు మారడం అనివార్యమైంది.
ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ మినహా మిగతా అంతర్జాతీయ టోర్నీలలో మాత్రం సుశీల్ 70 కేజీల విభాగంలో బరిలోకి దిగుతాడు. గత ఏడాది లండన్ ఒలింపిక్స్ తర్వాత ఏ టోర్నీలోనూ పాల్గొనని సుశీల్, యోగేశ్వర్ ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు అమెరికాలో జరిగే డేవ్ షుల్జ్ స్మారక అంతర్జాతీయ టోర్నీలకు తమ ఎంట్రీలను ఖరారు చేశారు. గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు నెగ్గిన అమిత్ కుమార్ దహియా 57 కేజీల్లో... బజరంగ్ 61 కేజీల్లో పాల్గొంటారు. ఇప్పటిదాకా 74 కేజీ విభాగంలో పోటీపడిన ఒలింపియన్ నర్సింగ్ యాదవ్ ఇక నుంచి 86 కేజీల విభాగానికి మారుతాడు.
సుశీల్ 74 కేజీలకు... యోగేశ్వర్ 65 కేజీలకు
Published Thu, Jan 2 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement