న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ‘దంగల్’లో దూకడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. 2014 గ్లాస్కో కామన్వెల్త్ గేమ్స్‌లో 74 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన తర్వాత సుశీల్ మరే టోర్నమెంట్‌లోనూ బరిలోకి దిగలేదు. బుధవారం ఇండోర్‌లో మొదలయ్యే జాతీయ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 34 ఏళ్ల సుశీల్ రైల్వేస్ తరఫున తన ఎంట్రీని ఖరారు చేశాడు. జార్జియాలో శిక్షణ ముగించుకొని ఆదివారం భారత్‌కు చేరుకున్న సుశీల్ సెలెక్షన్ ట్రయల్స్‌లోనూ పాల్గొని విజేతగా నిలిచాడు. మరోవైపు జాతీయ చాంపియన్‌షిప్‌లో తాను పాల్గొనడంలేదని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ తెలిపాడు.
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్‌తోపాటు గీత ఫోగట్, వినేశ్ ఫోగట్ కూడా జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నారు. గత ఏడాది రియో ఒలింపిక్స్ సమయంలో మరో భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్, సుశీల్ కుమార్ మధ్య వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ చాంపియన్ షిప్‌లో కాంస్యం నెగ్గి ఒలింపిక్ బెర్త్ సంపాదించిన నర్సింగ్ యాదవ్‌ను ‘రియో’కు పంపిస్తామని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) స్పష్టం చేయగా... నర్సింగ్‌తో ట్రయల్ నిర్వహించి అందులో గెలిచిన వారిని ‘రియో’కు పంపాలని సుశీల్ కోరాడు. అయితే సుశీల్ అభ్యర్థనను డబ్ల్యూఎఫ్‌ఐ తిరస్కరించడం, చివరకు నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో పట్టుబడటంతో రియో ఒలింపిక్స్‌లో 74 కేజీల విభాగంలో భారత్ తరపున ఎవరూ బరిలోకి దిగలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment