
మొదట్లోనే ప్రత్యర్థికి ఆధిక్యం సమర్పించుకున్నా... తర్వాత పట్టు జారకుండా చూసుకుంటూ... అవకాశాలు సృష్టించుకున్న స్విట్జర్లాండ్... సెర్బియాను బోల్తా కొట్టిస్తూ విజయాన్ని ఒడిసిపట్టింది! గ్రానిట్ జాకా, జెర్డాన్ షకీరి రెండు అద్భుత గోల్స్‌తో తమ జట్టును గట్టెక్కించగా... చివరి నిమిషంలో మ్యాచ్‌ను చేజార్చుకుని సెర్బియా నిస్సహాయంగా మిగిలింది!
కలినిన్‌గ్రాడ్: మొదటి మ్యాచ్‌లో బ్రెజిల్‌ను నిలువరించిన స్విట్జర్లాండ్... కీలకమైన రెండో మ్యాచ్‌లో సెర్బియాను ఓడించి నాకౌట్‌కు మార్గం సిద్ధం చేసుకుంది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగిన పోరులో ఆ జట్టు 2–1తో సెర్బియాను కంగుతినిపించింది. స్విట్జర్లాండ్ తరఫున జాకా (53వ నిమిషం), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షకీరి (90వ నిమిషం) ఒక్కో గోల్ చేశారు. అద్భుతం అనదగిన రీతిలో చాలా దూరం నుంచే బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపిన వీరు... తమ జట్టు ఆశలు నిలిపారు. అంతకు ముందు సెర్బియా తరఫున మిట్రోవిక్ (5వ నిమిషం) గోల్ కొట్టాడు. ప్రస్తుతం 4 పాయింట్లతో ఉన్న స్విస్ జట్టు... ఈ నెల 27న కోస్టారికాతో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. ఇదే రోజున బ్రెజిల్‌తో జరగనున్న పోరులో గెలిస్తేనే సెర్బియా తదుపరి దశకు వెళ్తుంది.
మొదట్లోనే సెర్బియా షాక్...
స్విస్‌కు మ్యాచ్ ఆరంభంలోనే సెర్బియా షాకిచ్చింది. డాసన్ టాడిక్ నుంచి అందిన క్రాస్‌ను చక్కగా సమన్వయం చేసుకున్న అలెగ్జాండర్ మిట్రోవిక్ 5వ నిమిషంలో తలతో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపి ఖాతా తెరిచాడు. దీంతో మొదటి భాగంలో 1–0తో సెర్బియాదే పైచేయి అయింది.
రెండో భాగంలో స్విస్ జోరు...
మొదటి భాగంలో కోల్పోయిన ఆధిక్యాన్ని స్విట్జర్లాండ్ రెండో భాగం ప్రారంభంలోనే సమం చేసింది. ఈ ఘనత షకీరి, జాకా ఇద్దరికీ చెందుతుంది. 53వ నిమిషంలో షకీరి కొట్టిన బలమైన షాట్‌కు బంతి సెర్బియా ఆటగాడికి తగిలి వెనక్కు వెళ్లింది. దీనిని దొరకబుచ్చుకున్న జాకా అంతే వేగంగా స్పందించాడు. ‘డి’ బాక్స్ ముందు ఉన్న అతడు... ఐదుగురు ప్రత్యర్థి ఆటగాళ్లను తప్పిస్తూ నేరుగా గోల్ కొట్టాడు. మరోవైపు సెర్బియా పోటీగా ఆడటంతో మ్యాచ్ ‘డ్రా’వైపు సాగేలా కనిపించింది. అయితే... 90వ నిమిషంలో షకీరి అద్భుతం చేశాడు. దాదాపు మైదానం మధ్యలో బంతిని అందుకున్న అతడు ప్రత్యర్థి ఆటగాడికి చిక్కకుండా వేగంగా పరిగెడుతూ గోల్‌పోస్ట్ ముందు కీపర్‌ను ఏమారుస్తూ స్కోరు చేశాడు. ఈ ఆనందంలో అతడు చొక్కా విప్పి ఎల్లో కార్డుకు గురయ్యాడు. ఇంజ్యూరీ సమయం పెద్దగా మెరుపులేమీ లేకుండానే సాగిపోవడంతో స్విస్ జట్టునే విజయం వరించింది. ఈ ప్రపంచకప్‌లో తొలిగా గోల్ ఇచ్చి... మ్యాచ్‌లో గెలిచిన జట్టుగా స్విట్జర్లాండ్ నిలిచింది.
గోల్ సంబరాలపై అభ్యంతరం
మ్యాచ్‌లో గోల్స్ అనంతరం జాకా, షకీరి చేసిన ‘డబుల్ ఈగల్’ సంకేతాలు చర్చకు తావిచ్చాయి. వీరిద్దరితో పాటు మరో ఆటగాడు బెల్రామి సెర్బియాలోని ఒకప్పటి రాష్ట్రమైన కొసావో మూలాలున్న వారు. స్వయంప్రతిపత్తి అంశమై సెర్బియాతో కొసావో గతంలో పెద్ద ఎత్తున ఘర్షణ పడింది. ఇదే అంశమై పోరాడినందుకు 1980ల్లో షకీరి తండ్రిని సెర్బియా జైల్లో పెట్టింది. ప్రపంచ కప్‌లో అదే దేశానికి ప్రత్యర్థిగా ఆడే సందర్భం రావడంతో నాటి శత్రుత్వాన్ని దృష్టిలో పెట్టుకున్న షకీరి... కొసావో గుర్తు ఉన్న బూట్లతో మ్యాచ్ ఆడేందుకు ఫిఫా అనుమతి కోరాడు. అయితే, దీనికి అంగీకారం రాలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లో అతడిని సెర్బియా అభి మానులు పలుసార్లు ఎగతాళి చేశారు. అయితే, గోల్ చేసిన అనంతరం జాకా, షకీరి వీటికి సమాధానంగా... సెర్బియా పతాకంలో ఉండే రెండు గద్దల గుర్తును ఎద్దేవా చేస్తున్నట్లు సంకేతాలు చేశారు. షకీరి ఏకంగా చొక్కానే విప్పేశాడు. వీటిపై స్విస్ కోచ్ పెట్కోవిక్ మ్యాచ్ తర్వాత స్పందించాడు. ఫుట్‌బాల్–రాజకీయాలు వేర్వేరని, రెండింటినీ ముడి పెట్టవద్దని వ్యాఖ్యానించి వాతావరణాన్ని శాంతింపజేశాడు. అటువైపు షకీరి కూడా ఇందులో వేరే ఉద్దేశం లేదన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment