ముంబై: ఈ ఏడాది వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, టోక్యో ఒలింపిక్స్, ఐపీఎల్ ఇలా జగమెరిగిన టోర్నీలన్నీ కరోనా ఖాతాలో వాయిదా పడ్డట్లుగానే... తాజాగా టి20 ప్రపంచకప్ కూడా వాయిదా పడటం ఖాయమైంది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వాల్సిన ఈ టోర్నీని వాయిదా వేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యోచిస్తోంది. ఈ విషయాన్ని ఐసీసీ త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశముంది. కాగా ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో జరిగే ఐసీసీ సమావేశాలు ఆసక్తికరంగా మారనున్నాయి.
ఆ సమావేశాల్లోనే టోర్నీ నిర్వహణకు పలు ప్రత్యామ్నాయాల్ని పరిశీలిస్తుంది. ఇందులో ప్రధానంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి షెడ్యూల్‌కే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. దీని వల్ల ఐపీఎల్ ఎప్పట్లాగే ఏప్రిల్‌లో జరుగుతుంది. కానీ భారత్‌లో ఇంగ్లండ్ పర్యటనపై దెబ్బ పడుతుంది. ఇదే జరిగితే ప్రసారకర్త అభ్యంతరం చెప్పొచ్చు. ఇక రెండో ప్రత్యామ్నాయం పరస్పరం మెగా టోర్నీల్ని ఆసీస్, భారత్ మార్చుకోవడం. అంటే 2022 వన్డే ప్రపంచకప్ భారత్ నుంచి ఆసీస్‌కు, 2021 టి20 ఈవెంట్ ఆసీస్ నుంచి భారత్‌కు చేతులు మారడం. కానీ దీనికి భారత్ ఒప్పుకోకపోవచ్చు. ప్రత్యామ్నాయమేదైనా బీసీసీఐ పాత్రే కీలకమవుతుంది. మరి ఐసీసీ చైర్మన్ పదవిపై కన్నేసిన గంగూలీ ఏం చేస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment