ఆసీస్కు చుక్కలు!
హమిల్టన్:చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీని న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. ఆదివారం ఆసీస్తో జరిగిన చివరిదైన మూడో వన్డేలో న్యూజిలాండ్ 24 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ విసిరిన 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా 47 ఓవర్లలో 257 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. తద్వారా న్యూజిలాండ్ 2-0 తో ట్రోఫీని చేజిక్కించుకుంది. రెండో వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.
మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 281 పరుగులు నమోదు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో రాస్ టేలర్(107) బ్రౌన్లీ(63)లు రాణించగా, కేన్ విలియమ్సన్(37), సాంత్నార్(38)లు ఫర్వాలేదనిపించారు.
అనంతరం సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు కివీస్ బౌలర్లు చుక్కలు చూపెట్టారు. ప్రధానంగా ఆసీస్ ను కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చావు దెబ్బ కొట్టాడు. పది ఓవర్లలో 33 పరుగులిచ్చి ఆరు వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్ ను కకావికలం చేశాడు. ఇది వన్డేల్లో బౌల్ట్ అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనగా నమోదు కావడం విశేషం. అతనికి జతగా సాంత్నార్ రెండు వికెట్లు తీయగా,విలియమ్స్ ను ఒక వికెట్ తీశాడు. ఆసీస్ జట్టులో ఆరోన్ ఫించ్(56), హెడ్(53), స్టోయినిస్(42)లు రాణించినా మిగతా వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.తొలి వన్డేలో న్యూజిలాండ్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.