కోహ్లీసేన ప్రతీకార విజయం
రెండేళ్ల క్రితం ఇదే వేదికపై శ్రీలంక చేతిలో ఎదురైన దారుణ ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. లంకతో జరిగిన తొలిటెస్టులో విరాట్ కోహ్లీ సేన 304 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 550 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో 245 పరగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్, జడేజాలు చెరో మూడు వికెట్లు పడగొట్టగా, షమీ, ఉమేశ్ లకు ఒక్కో వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
అంతకుముందు 188/3 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ 53 ఓవర్లలో 240 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ కెప్టెన్ విరాట్ కోహ్లి 133 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు రహానే(23 నాటౌట్) క్రీజులో ఉండగా కెప్టెన్ కోహ్లీ తమ రెండో ఇన్నింగ్స్ ను 240/3 వద్ద డిక్లేర్ చేశాడు. దీంతో ఓవరాల్ గా భారత్ కు 550 పరుగుల ఆధిక్యం లభించింది.
కరుణరత్నే పోరాటం వృథా
భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంక 29 పరుగులకే ఓపెనర్ తరంగ(10), గుణతిలక(2) వికెట్లను కోల్పోయింది. మరో ఓపెనర్ కరుణరత్నే (208 బంతుల్లో 97; 9 ఫోర్లు) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. కీపర్ డిక్ వెల్లా(67), కుశాల్ మెండిస్ (36) పరవాలేదనిపించారు. ఓటమి అంతరాన్ని తగ్గించడానికి లంక ఎంతో శ్రమించినా భారత బౌలర్ల సమిష్టి రాణింపుతో 245 పరుగులకే చాప చుట్టేసింది. దీంతో రెండేళ్ల కింద గాలే టెస్టులో ఓటమికి కోహ్లీ సేన ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.
[ ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ]