టెస్టుల్లో... కోహ్లి ద్విశతకాలు బాదాడు. అశ్విన్, జడేజా స్పిన్‌తో చుట్టేశారు. వన్డేల్లో రోహిత్ ట్రిపుల్ డబుల్ కొట్టాడు. ఇదంతా గతం. ఇక మొదలవనున్నది అసలు సిసలు సవాల్. మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టి20లు. పేస్‌కు పెట్టింది పేరైన దక్షిణాఫ్రికాలో రెండు నెలల సుదీర్ఘ పర్యటన. దీనిపై కెప్టెన్ కోహ్లి మనోభావాలేమిటి? అతని అంచనాలు ఎలా ఉన్నాయి..?
ముంబై: ‘విదేశీ పర్యటనల సందర్భంగా ఎదురయ్యే అన్ని రకాల మానసిక ఒత్తిళ్లను మేం అధిగమించాం. మేం కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. దేశం తరఫున వంద శాతం ప్రదర్శన కనబర్చి కోరుకున్నది సాధించాలని భావిస్తున్నాం. కఠిన సవాళ్లను ఛేదించినప్పుడే మరింత సంతృప్తి లభిస్తుంది’ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. గురువారం ఉదయం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు కోహ్లి బుధవారం జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఏమన్నాడో అతడి మాటల్లోనే...
వాస్తవిక దృక్పథం కీలకం...
‘కొన్నిసార్లు సానుకూల ఫలితాలు వస్తాయి. మరికొన్నిసార్లు రావు. వర్తమానంలో ఉంటూ వాస్తవిక దృక్ప థంతో ఆలోచించాలి. ఏం చేయగలమో అదే చేయాలి. మేం వెళ్తున్నది క్రికెట్ ఆడేందుకు. అది దక్షిణాఫ్రికాలో నా, ఆస్ట్రేలియాలోనా, ఇంగ్లండ్‌లోనా లేక భారత్‌లోనా అన్నది అప్రస్తుతం. నా దృష్టిలో క్రికెట్ బంతికి, బ్యాట్‌కు మధ్య పోరు మాత్రమే. అది ఎక్కడైనా మాకు ఒకటే.
విదేశాల్లో మన బ్యాటింగ్‌పై...
ఎక్కడైనా సరే బ్యాట్స్‌మన్ మానసిక దృక్పథం సరిగా ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఇబ్బంది అనిపించదు. సరైన ఆలోచనా తీరు లేకుంటే భారత పిచ్‌లూ కఠినంగానే కనిపిస్తాయి. సవాళ్లను ధైర్యంగా స్వీకరించి... సంస్కృతిని ఆకళింపు చేసుకుంటే అంతా స్వదేశంలోలానే అనిపిస్తుంది.
గత దక్షిణాఫ్రికా పర్యటనపై
నేను 2013–14లో పర్యటించా. నాతో పాటు అప్పట్లో పుజారా, రహానే బాగా ఆడారు. మేమంతా ఎంతో ఉత్సుకతతో పాల్గొన్నాం. ప్రస్తుతం దానిని కొనసాగించడం ముఖ్యం. మంచి ప్రదర్శన కనబరుస్తామనే నమ్మకం ఉంది. నా దృష్టిలో ఏ జట్టుకైనా భిన్న అనుభవాలను మిగిల్చే ప్రతి సిరీసూ ఓ అవకాశమే. దక్షిణాఫ్రికా టూర్ అనగానే గత జట్ల ప్రదర్శనను ప్రస్తావిస్తారు. దిగ్గజాలు లేకున్నా... ప్రస్తుతం సిరీస్ గెలిచేందుకు మాకు అవకాశం ఉంది.
నిలకడతోనే విజయాలు...
సిరీస్ గెలవాలంటే ఆసాంతం నిలకడైన ఆటతీరు కనబర్చాలి. ఆ సందర్భం కోసం ఆస క్తిగా ఎదురు చూస్తున్నాం. మేం ఒకరి సహచర్యాన్ని మరొకరం ఆస్వాదిస్తున్నాం. దానినే ఆచరణలోకి తీసుకురావాలని చూస్తున్నాం.
ప్రత్యర్థి పేస్ బౌలింగ్‌పై...
2013–14తో పోలిస్తే దక్షిణాఫ్రికా బౌలింగ్ అనుభవం గడించింది. నాడు మేం మెరుగైన ప్రదర్శన ఇచ్చాం. వారిపై పైచేయి సాధించాం. జొహన్నెస్‌బర్గ్‌లో దాదాపు గెలిచినంత పనిచేశాం. డర్బన్‌లో పోరాడి ఓడాం. ఇప్పుడు మన బ్యాటింగ్, బౌలింగ్ రాటుదేలాయి. కుర్రాళ్లు గతంలో సాధించలేక పోయిన దానిని ఈసారి సాధిస్తారు.
ప్రస్తుత జట్టులోని సభ్యులు నాలుగైదేళ్లుగా కలిసి ఆడుతున్నారు. క్లిష్టమైన సందర్భాల్లో ఈ అనుభవం వారికి ఉపకరిస్తుంది. వరుసగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్నందున ఈ 18 నెలలు మన జట్టు సత్తాను తేలుస్తాయి. ఇందుకు తగినట్లుగానే జట్టుంది. ప్రత్యర్థి పేసర్లకు తగినట్లుగా మనకూ బౌలింగ్ వనరులున్నాయి. వారు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడితే మన బౌలర్లు వారికి అంతే దీటుగా పోటీ ఇస్తారు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడాం. ఇంగ్లండ్, శ్రీలంకలోనూ రాణించాం. మన సన్నాహాలు కూడా బాగున్నాయి. విదేశాల్లో సిరీస్ గెలిచేందుకు ఇది సరైన సమయం.
– రవిశాస్త్రి, భారత కోచ్
నా రక్తంలోనే క్రికెట్ ఉంది. జీవితంలో వివాహమనేది ఒక సిరీస్‌ను మించి ఎంతో ముఖ్యమైనది. మా జంట తరచూ గుర్తుచేసుకునే సందర్భం ఇది. ఈ విరామం నా ఆటతీరుపై ప్రభావం చూపదు. మైదానంలో దిగకపోయినా నా మనసునిండా దక్షిణాఫ్రికాతో జరుగబోయే సిరీస్ ఆలోచనలే. మానసికంగా ఎల్లప్పుడూ నేను సిద్ధంగానే ఉన్నాను.
– కోహ్లి (భారత కెప్టెన్)
Comments
Please login to add a commentAdd a comment