విరాట్ కోహ్లి
నాటింగ్‌హామ్: మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఉపశమనం కలిగించే పరిణామం. రెండో టెస్టు సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన కెప్టెన్ విరాట్ కోహ్లి... పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. మధ్యమధ్యలో ఫిజియోల పర్యవేక్షణలో గురువారం నెట్స్‌లో అతడు తీవ్రంగా బ్యాటింగ్ సాధన చేశాడు. స్లిప్ ఫీల్డింగ్‌కు వెళ్లి క్యాచ్‌లు పట్టాడు. ‘కోహ్లి ఫిట్‌నెస్ మెరుగైంది. నెట్స్‌లో సౌకర్యంగా కదిలాడు. మ్యాచ్ సమయానికి మరింతగా సంసిద్ధమవుతాడు’ అని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు క్లిష్టంగా ఉన్నాయని, అలాంటప్పుడే అసలైన ఆట బయటకు వస్తుందని రవిశాస్త్రి అన్నాడు. ఆఫ్‌స్టంప్‌ను చూసుకుంటూ, ఆడలేని బంతులను వదిలేస్తూ, చెత్త బంతుల కోసం వేచి చూడాలని సూచించాడు.
రహానే ఫామ్ గురించి ప్రస్తావించగా... రెండు జట్ల బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మానసిక స్థైర్యమే కీలక పాత్ర పోషిస్తుందని, ఏ ఒక్కరినో వేలెత్తి చూపలేమని స్పష్టం చేశాడు. లార్డ్స్ టెస్టులో రెండో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను ఆడించడం పొరపాటేనని... మరో పేసర్ అయితే ఉపయోగకరంగా ఉండేదని శాస్త్రి అంగీకరించాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఐదో రోజుకు వెళ్లి స్పిన్ తిరుగుతుందని భావించి కుల్దీప్‌ను తీసుకున్నట్లు వివరించాడు. ఓటమి అనంతరం... ‘గతంలోనూ ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి గెలిచినందున మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు’ అని మాత్రమే ఆటగాళ్లకు సూచించినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. మరోవైపు... కోహ్లి గాయం నుంచి కోలుకుంటే మరింత విజృంభించి ఆడతాడని ఇంగ్లండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ తమ జట్టు సభ్యులకు హెచ్చరికతో కూడిన సూచన చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment