Ravishastri
-
పాకిస్తాన్‌దే పైచేయి! అక్కడ టీమిండియాదే హవా.. నాడు రోజర్ బిన్నీ, రవిశాస్త్రి కారణంగా..
భారత్ వర్సెస్ పాకిస్తాన్.. దాయాదుల మధ్య క్రికెట్ పోరుకు ఉన్న క్రేజే వేరు. గెలుపు కోసం చిరకాల ప్రత్యర్థులు మైదానంలో పోటాపోటీగా ముందుకు సాగుతూ ఉంటే అభిమానులకు కన్నులపండుగగా ఉంటుంది. హై వోల్టేజీ పోరులో విజయం ఎవరిని వరిస్తుందా అని ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2(శనివారం)న ఆసియా కప్-2023 వన్డే టోర్నీలో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్- పాకిస్తాన్ సిద్ధమయ్యాయి. ఇప్పటికే నేపాల్‌పై విజయంతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉండగా.. రోహిత్ సేన ఈ మ్యాచ్‌తోనే ఈవెంట్‌ను ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థుల మధ్య తొలి వన్డే ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఆ మ్యాచ్‌లో విజేత ఎవరు? ఆసియా కప్ చరిత్రలో ఆధిపత్యం ఎవరిది? ఓవరాల్‌గా వన్డేల్లో ఎవరు ముందంజలో ఉన్నారు? తదితర అంశాలు గమనిద్దాం. తొలిసారి అక్కడే బలూచిస్తాన్‌లోని క్వెటా వేదికగా 1978లో తొలిసారి భారత్, పాకిస్తాన్ వన్డే మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌పై 4 పరుగుల స్వల్ప తేడాతో జయభేరి మోగించింది. పాకిస్తాన్‌దే పైచేయి! ఇక ఇప్పటి వరకు భారత్- పాకిస్తాన్ మధ్య మొత్తంగా 132 వన్డేలు జరుగగా.. 73 మ్యాచ్‌లలో పాక్ విజయం సాధించింది. టీమిండియా 55 మ్యాచ్‌లలో గెలుపొందింది. ఇరు జట్ల మధ్య నాలుగు మ్యాచ్‌లు డ్రాగా ముగిసిపోయాయి. తొట్టతొలి విజేత భారత్ ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీలో మాత్రం భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. 1984లో షార్జాలో ఆరంభమైన ఈ మెగా ఈవెంట్లో టీమిండియా పాక్‌తో తొలిసారి తలపడింది. నాటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని 54 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొట్టతొలి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. నాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే ఆనాడు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 46 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సురీందర్ ఖన్నా 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సందీప్ పాటిల్ 43 రన్స్‌తో రాణించాడు. నాటి కెప్టెన్ సునిల్ గావస్కర్ 36 పరుగులు సాధించగా.. గులాం పార్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ వరుసగా 22, 14 పరుగులు చేశారు. పాకిస్తాన్ జట్టులో సర్ఫరాజ్ నవాజ్, షాహిద్ మహబూబ్, ముదాసర్ నాజర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 39.2 ఓవర్లలోనే 134 పరుగులకు ఆలౌట్ అయింది. మొహ్సిన్ ఖాన్ 35 పరుగులు చేయగా.. కెప్టెన్ జహీర్ అబ్బాస్ 27 పరుగులు సాధించాడు. రోజర్ బిన్నీ, రవిశాస్త్రి మ్యాజిక్ మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో పాక్ తక్కువ స్కోరుకే పరిమితమై భారీ ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియా బౌలర్లలో పేసర్ రోజర్ బిన్నీ, స్పిన్నర్ రవిశాస్త్రి ఆకాశమే హద్దుగా చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. చెరో మూడు వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఇక నలుగురు బ్యాటర్లు రనౌట్ల రూపంలో వెనుదిరగడంతో పాక్ కథ ముగిసిపోయింది. టైటిల్ భారత్ సొంతమైంది. ఆసియాలో టీమిండియాదే హవా ఓవరాల్‌గా వన్డేల్లో పాకిస్తాన్ ఆధిక్యంలో ఉన్నా ఆసియా కప్ టోర్నీలో మాత్రం భారత్ హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఏడుసార్లు టైటిల్ గెలిచిన ఘనత టీమిండియాది. ఇందులో ఆరు వన్డే, ఒక టీ20 ట్రోఫీ ఉన్నాయి. పాక్ కేవలం రెండుసార్లు రెండేళ్లకోసారి నిర్వహించే ఈ ఈవెంట్లో 1984, 1988, 1990, 1995, 2010, 2016, 2018లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఇక పాకిస్తాన్ ఇప్పటి వరకు 2000, 2012లో.. అంటే రెండుసార్లు మాత్రమే చాంపియన్‌గా నిలిచింది. 2000 ఫైనల్లో శ్రీలంకను 39 పరుగులు, 2012లో బంగ్లాదేశ్‌ను 2 పరుగులతో ఓడించి టైటిల్ గెలిచింది. ముఖాముఖి పోరులో ఇక ముఖాముఖి పోరులో 1984- 2022 వరకు భారత్- పాకిస్తాన్ వన్డే పోరులో 13 మ్యాచ్‌లలో టీమిండియా గెలుపొందగా.. పాక్ ఐదుసార్లు విజయం సాధించింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దైపోయింది. చదవండి: వన్డేల్లో ఏకైక బ్యాటర్‌గా రోహిత్ రికార్డు.. మరి ఆసియా కప్‌లో? ఈ గణాంకాలు చూస్తే -
గిల్ నేర్చుకుంటున్నాడు.. కానీ పుజారాకు ఏమైంది: రవిశాస్త్రి
ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా పట్టు కోల్పోయిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో బౌలర్లు విఫలం కాగా.. రెండో రోజు బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు శుభ్‌మన్ గిల్, పుజారా, కోహ్లి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో వెటరన్ ఆటగాడు చతేశ్వర్ పుజారా ఔటైన తీరుపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి విమర్శల వర్షం కురిపించాడు. చెత్త షాట్ సెలెక్షన్ వల్లే పుజారా క్లీన్ బౌల్డయ్యాడు. గ్రీన్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విఫలమైన పుజారా బౌల్డయ్యాడు. అంతకుముందు అదే రీతిలో బోలాండ్ బౌలింగ్‌లో గిల్ కూడా ఔటయ్యాడు. "పుజారా లాంటి సీనియర్ ఆటగాడు బంతిని తప్పుగా అంచనా వేయడం నిరాశపరిచింది. ఫ్రంట్ ఫుట్ సరిగా వాడకుండా బంతిని వదిలేయడం దారుణం. అతడి ఫ్రంట్ ఫుట్ బంతివైపు వెళ్లాల్సింది. అతడు ఆ బంతిని ముందు ఆడాలని అనుకున్నాడు. కానీ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోని బంతిని విడిచిపెట్టాడు. అందుకు తగ్గ ప్రతిఫలం అనువభవించాడు. ఆఫ్‌స్టంప్ ఎగిరిపోయింది. ఆ సమయంలో ఆఫ్‌స్టంప్‌కు వెళ్లాల్సిన అతడి ఫ్రంట్ ఫుట్ మిడిల్ స్టంప్పైనే ఉండిపోయింది. కానీ అతడు మాత్రం తన ఫ్రంట్ ఫుట్ ఆఫ్‌స్టంప్ పైనే ఉందని అనుకున్నాడు. ఇక శుబ్‌మన్ గిల్ కూడా ఇదే తరహాలో తన వికెట్‌ను కోల్పోయాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై బంతిని ఆడకుండా వదిలేయాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆఫ్‌స్టంప్ దగ్గరగా ఉన్నప్పుడు అలా చేయాలి. శుభమాన్ గిల్ తన ఫుట్‌వర్క్‌లో విషయంలో కాస్త బద్ధకంగా కనిపించాడు. అయితే గిల్ ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడు. కానీ పుజరాకు ఏమైంది" అని కామెంటరీ సందర్బంగా రవిశాస్త్రి పేర్కొన్నాడు. చదవండి: WTC Final: టీమిండియాకు ఇదేమి కొత్తకాదు.. గెలిచే ఛాన్స్ ఉందా? కనీసం డ్రా అయినా -
రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు..!
-
రవిశాస్త్రి జీతమెంతో తెలుసా..?
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని వరుసగా రెండోసారి నియమించిన భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడి వార్షిక జీతాన్ని దాదాపు 20 శాతం వరకు పెంచిందని సమాచారం. దీంతో ఏడాదికి అతని వార్షిక జీతం రూ.10 కోట్లకి చేరే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ ఓటమి అనంతరం రవిశాస్త్రిపై వేటు తప్పదని అంతా భావించారు. గత రెండేళ్ల కాలంలో విదేశాల్లోనూ భారత్ జట్టు రాణిస్తుండటం, టీమిండియా ఆటగాళ్లతోనూ రవిశాస్త్రికి ఉన్న సత్సంబంధాలు ఉండటంతో అనూహ్యంగా మళ్లీ అతడినే కోచ్ పదవి వరించింది. ఇటీవల రెండో పర్యాయం ప్రధాన కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. 2021లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు కోచ్‌గా కొనసాగనున్నాడు. ప్రస్తుతం ఏడాదికి రూ. 8కోట్ల వరకు జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల వరకు పెరగనుంది. దీంతో ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉండనుంది. సంజయ్ బంగర్ స్థానంలో ఎంపికైన విక్రమ్ రాథోడ్ కూడా వార్షిక వేతనంగా రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు అందుకోనున్నారు. ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్‌కోచ్ భరత్ అరుణ్‌లకు కూడా వార్షిక వేతనాలు పెరిగాయి. వారు ప్రస్తుతం ఏడాదికి రూ. 3.5 కోట్లు వరకు తీసుకుంటారని సమాచారం. పెంచిన జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇటీవల వెస్టిండీస్ పర్యటనని విజయవంతంగా ముగించిన భారత జట్టు ఈనెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆసీస్ గడ్డపై దశాబ్దాల నిరీక్షణ అనంతరం గత ఏడాది టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానంలో కొనసాగుతోంది. -
అత్యున్నతంగా నిలపడమే లక్ష్యం
కూలిడ్జ్ (అంటిగ్వా): భారత పురుషుల జాతీయ జట్టు హెడ్ కోచ్‌గా నియామకం అనంతరం రవిశాస్త్రి తన భవిష్యత్ ప్రణాళికను వివరించాడు. కొత్త తరం వస్తున్నందున తాను వైదొలిగే లోపు జట్టు పునర్ నిర్మాణ ప్రక్రియ సాఫీగా సాగేలా చూడటం ప్రధానమైనదని పేర్కొన్నాడు. మరో నలుగురైదుగురు బౌలర్లను వెదికి పట్టుకోవడం ఇందులోని సవాల్‌గా అతడు తెలిపాడు. ‘26 నెలల నా పదవీ కాలం పూర్తయ్యేసరికి టీమిండియాను అత్యున్నత స్థానంలో నిలపపడమే లక్ష్యం. తద్వార రాబోయే తరానికి వారు ఘన వారసత్వం అందిస్తారు. ఈ జట్టు మున్ముందు అద్భుతాలు సృష్టించగలదన్న నమ్మకం నాకుంది. మేం ఇప్పుడు ఆ దిశగానే వెళ్తున్నాం. పురోగమనానికి అంతుండదు. యువ ఆటగాళ్లను చూస్తుంటే ఉత్సాహంగా ఉంది. ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు శ్రద్ధ కూడా అదేవిధంగా ఉండాలి. ఫలితాలు రాకపోయినా నిరుత్సాహం చెందొద్దు. గత రెండు–మూడేళ్లుగా టీమిండియా స్థిరంగా విజయాలు సాధిస్తోంది. ఇకపై వాటిని మరింత పెంచుకుంటూ పోవాలి’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కొన్నేళ్లుగా జట్టు పురోగతిని విశ్లేషించిన అతడు ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఫీల్డింగ్‌లో సాధించిన ప్రగతిని నొక్కిచెప్పాడు. ఈ ప్రమాణాలను మరో మెట్టు ఎక్కించడమే తమ బృందం లక్ష్యమని వివరించాడు. -
ఆట అదుపు... మాట పొదుపు
ముంబై: కఠిన పరిస్థితుల్లో మన బ్యాట్స్‌మెన్ మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరం ఉందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అలాంటి స్థితిలో మరెక్కడి నుంచో పరిష్కారం లభిస్తుందని ఆశించకుండా తామే ఆటను అదుపులోకి తెచ్చుకోవాలని అతను అన్నాడు. సుదీర్ఘ పర్యటన కోసం ఆస్ట్రేలియా బయల్దేరుతున్న నేపథ్యంలో గురువారం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లండ్ పర్యటన తర్వాత తమ ఆటతీరుపై జరిపిన సమీక్ష, రాబోయే సిరీస్ సన్నద్ధతపై అతను తన ఆలోచనలు వెల్లడించాడు. కోచ్ రవిశాస్త్రి తీరు గురించి, స్లెడ్జింగ్, పేసర్ల ప్రదర్శన, జట్టు పరిస్థితి తదితర అంశాలపై సూటిగా జవాబులిచ్చాడు. కోహ్లి ఏమన్నాడో అతడి మాటల్లోనే... ఆయన ‘ఎస్ మ్యాన్’ కాదు... నేనేం చెప్పినా రవిశాస్త్రి సరే అంటాడని, ఆయన కేవలం ‘ఎస్ మ్యాన్’ అని విమర్శిస్తున్నారు. భారత క్రికెట్లో నేను విన్న అతి వింత పదం ఇది. రవి భాయ్ చెప్పినన్ని సార్లు నాకెవరూ ‘నో’ చెప్పలేదు. నిజాయతీతో కూడిన అభిప్రాయం కోసం నేను సంప్రదించే వ్యక్తుల్లో ఆయన ఒకరు. తన సూచనలతో నా ఆటలో చాలా మార్పులు చేసుకున్నా. ప్రస్తుత జట్టు నిర్మాణంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఇవి బయటకు వెల్లడించాల్సిన అవసరం లేని జట్టు అంతర్గత అంశాలు. మా మనసులు పరిశుద్ధం. మా దృక్పథం సరైనది. అయినా ప్రజలకు సొంత అభిప్రాయం వెల్లడించే హక్కుంది. వాటిపై మేం తీర్పు ఇవ్వలేం. జట్టు గురించి... మెరుగవ్వాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. దేనిపై దృష్టి పెట్టాలో జట్టుగా మాకు తెలుసు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకునేందుకు సిద్ధం కావాలి. ఇంగ్లండ్ పర్యటన తర్వాత తప్పులను సమీక్షించుకున్నాం. కఠినమైన పరిస్థితులకు ఎదురీది మ్యాచ్‌ను అదుపులోకి తీసుకోవడం ఎలా అనేదానిపై ఆలోచించాలి. బౌలర్ల ఫిట్‌నెస్‌పై... గత ఆస్ట్రేలియా పర్యటనతో పోలిస్తే ఈసారి మా బౌలర్ల ఫిట్నెస్ స్థాయి పెరిగింది. పిచ్ నుంచి సహకారం లభించని, కూకాబుర్రా బంతి కూడా పెద్దగా ప్రభావం చూపలేని స్థితిలో కూడా రోజంతా పేస్‌లో పదును తగ్గకుండా చూసుకోవాలి. దక్షిణాఫ్రికా ఇలాగే చేసి ఇక్కడ టెస్టుల్లో గెలవగలిగింది. బ్యాట్స్‌మెన్ బాధ్యత అది... ఆటగాళ్లు ముఖ్యంగా బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. సమష్టి ప్రదర్శన ఉంటే ఒక్క టెస్టు కాదు... సిరీసే గెలవగలం. లోయరార్డర్ భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. విదేశాల్లో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్లు మనం ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఇవ్వవు. మన జట్టు అనూహ్యంగా కుప్పకూలిపోతే మళ్లీ కోలుకునే ప్రయత్నం చేయాలే తప్ప దాని గురించి ఆలోచిస్తూ మళ్లీ దెబ్బ తినకూడదు. స్లెడ్జింగ్ లేకుండా ఆడగలను... ‘నో స్లెడ్జింగ్’ విధానం అవలంబించాలని ఆసీస్ క్రికెట్ భావించడం వారికి సంబంధించిన విషయం. వాగ్వాదాలు లేని ఆటకు నేను సిద్ధమే. కెరీర్ ప్రారంభంలో దూకుడుగా ఉన్న నేను పరిణతి సాధించాను. సొంత శక్తిసామర్థ్యాలపై నమ్మకంతో బాగా ఆడగలను. అయినా మేమెప్పుడూ ముందుగా స్లెడ్జింగ్‌కు దిగలేదు. మాది కేవలం ప్రతిస్పందనే. ఇలాంటివి లేకుంటే ఎవరి ఆట వారు ఆడుకుంటాం. -
పెళ్లి పీటలెక్కని రవిశాస్త్రి ఫస్ట్ లవ్!
ముంబై: మన్సూర్ అలీఖాన్ పటౌడీ-షర్మిల ఠాగుర్‌తో మొదలైన బాలీవుడ్-క్రికెటర్ల ప్రేమాయణాలు నేటి విరుష్క జంట వరకు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌ల మధ్య ప్రేమ చిగురించిందని, గత రెండేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు హాట్‌టాపిక్ అయ్యాయి. గతంలోనే పెళ్లి అయ్యిన 56 ఏళ్ల రవిశాస్త్రికి సంతానం కూడా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా భార్య రితూ సింగ్‌కు రవిశాస్త్రి దూరంగా ఉంటున్నట్లు, విడాకులు తీసుకున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ క్రమంలోనే భారత హెడ్‌కోచ్, నిమ్రత్ కౌర్ ప్రేమ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో రవిశాస్త్రి 1980 నాటి ప్రేమ కథల మరోసారి చర్చనీయాంశమైంది. బాలీవుడ్ నటి అమ్రితా సింగ్‌తో రవిశాస్త్రి తొలిసారి ప్రేమలో పడ్డారు. ఓ మ్యాగజైన్ కవర్ ఫొటోకు వీరిద్దరు ఫోజివ్వడంతో దేశం మొత్తం వీరి గురించే గుసగుసలాడింది. 1986లో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఈ జంట పెళ్లి పీటలెక్కలేకపోయింది. వారి పెళ్లి ఓ కలగానే మిగిలిపోయింది. ఓ సందర్భంలో.. ’ఓ నటిని నేను భార్యగా కోరుకోను. నేను ఆవేశపరుడిని. నా సతీమణికి తన ఇళ్లే తొలి ప్రాధాన్యంగా ఉండాలి.’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించగా.. దీనికి అమ్రితా సింగ్ బదులిస్తూ.. ’ప్రస్తుత తరుణంలో నా కెరీర్‌తో బిజీగా ఉన్నాను. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ మంచి భార్యగా, తల్లిగా మారుతానని’ తెలిపారు. అనంతరం కొన్నిరోజులకే వారి ప్రేమకు ఎండ్‌కార్డ్ పడింది. 1990లో రవిశాస్త్రి రితూను పెళ్లి చేసుకోగా.. 1991లో అమ్రితాను సైఫ్ అలిఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. -
నెట్స్‌లో శ్రమించిన కోహ్లి
నాటింగ్‌హామ్: మూడో టెస్టుకు ముందు భారత క్రికెట్ అభిమానులకు ఉపశమనం కలిగించే పరిణామం. రెండో టెస్టు సందర్భంగా వెన్నునొప్పితో ఇబ్బంది పడిన కెప్టెన్ విరాట్ కోహ్లి... పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. మధ్యమధ్యలో ఫిజియోల పర్యవేక్షణలో గురువారం నెట్స్‌లో అతడు తీవ్రంగా బ్యాటింగ్ సాధన చేశాడు. స్లిప్ ఫీల్డింగ్‌కు వెళ్లి క్యాచ్‌లు పట్టాడు. ‘కోహ్లి ఫిట్నెస్ మెరుగైంది. నెట్స్‌లో సౌకర్యంగా కదిలాడు. మ్యాచ్ సమయానికి మరింతగా సంసిద్ధమవుతాడు’ అని కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పిచ్‌లు బ్యాట్స్‌మెన్‌కు క్లిష్టంగా ఉన్నాయని, అలాంటప్పుడే అసలైన ఆట బయటకు వస్తుందని రవిశాస్త్రి అన్నాడు. ఆఫ్‌స్టంప్‌ను చూసుకుంటూ, ఆడలేని బంతులను వదిలేస్తూ, చెత్త బంతుల కోసం వేచి చూడాలని సూచించాడు. రహానే ఫామ్ గురించి ప్రస్తావించగా... రెండు జట్ల బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మానసిక స్థైర్యమే కీలక పాత్ర పోషిస్తుందని, ఏ ఒక్కరినో వేలెత్తి చూపలేమని స్పష్టం చేశాడు. లార్డ్స్ టెస్టులో రెండో స్పిన్నర్‌గా కుల్దీప్ను ఆడించడం పొరపాటేనని... మరో పేసర్ అయితే ఉపయోగకరంగా ఉండేదని శాస్త్రి అంగీకరించాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఐదో రోజుకు వెళ్లి స్పిన్ తిరుగుతుందని భావించి కుల్దీప్ను తీసుకున్నట్లు వివరించాడు. ఓటమి అనంతరం... ‘గతంలోనూ ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి గెలిచినందున మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు’ అని మాత్రమే ఆటగాళ్లకు సూచించినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. మరోవైపు... కోహ్లి గాయం నుంచి కోలుకుంటే మరింత విజృంభించి ఆడతాడని ఇంగ్లండ్ కోచ్ ట్రెవర్ బేలిస్ తమ జట్టు సభ్యులకు హెచ్చరికతో కూడిన సూచన చేశాడు. -
ఎక్కడైనా ఒక్కటే!
టెస్టుల్లో... కోహ్లి ద్విశతకాలు బాదాడు. అశ్విన్, జడేజా స్పిన్‌తో చుట్టేశారు. వన్డేల్లో రోహిత్ ట్రిపుల్ డబుల్ కొట్టాడు. ఇదంతా గతం. ఇక మొదలవనున్నది అసలు సిసలు సవాల్. మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టి20లు. పేస్‌కు పెట్టింది పేరైన దక్షిణాఫ్రికాలో రెండు నెలల సుదీర్ఘ పర్యటన. దీనిపై కెప్టెన్ కోహ్లి మనోభావాలేమిటి? అతని అంచనాలు ఎలా ఉన్నాయి..? ముంబై: ‘విదేశీ పర్యటనల సందర్భంగా ఎదురయ్యే అన్ని రకాల మానసిక ఒత్తిళ్లను మేం అధిగమించాం. మేం కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. దేశం తరఫున వంద శాతం ప్రదర్శన కనబర్చి కోరుకున్నది సాధించాలని భావిస్తున్నాం. కఠిన సవాళ్లను ఛేదించినప్పుడే మరింత సంతృప్తి లభిస్తుంది’ అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. గురువారం ఉదయం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లేముందు కోహ్లి బుధవారం జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రితో కలిసి ముంబైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఏమన్నాడో అతడి మాటల్లోనే... వాస్తవిక దృక్పథం కీలకం... ‘కొన్నిసార్లు సానుకూల ఫలితాలు వస్తాయి. మరికొన్నిసార్లు రావు. వర్తమానంలో ఉంటూ వాస్తవిక దృక్ప థంతో ఆలోచించాలి. ఏం చేయగలమో అదే చేయాలి. మేం వెళ్తున్నది క్రికెట్ ఆడేందుకు. అది దక్షిణాఫ్రికాలో నా, ఆస్ట్రేలియాలోనా, ఇంగ్లండ్‌లోనా లేక భారత్‌లోనా అన్నది అప్రస్తుతం. నా దృష్టిలో క్రికెట్ బంతికి, బ్యాట్‌కు మధ్య పోరు మాత్రమే. అది ఎక్కడైనా మాకు ఒకటే. విదేశాల్లో మన బ్యాటింగ్‌పై... ఎక్కడైనా సరే బ్యాట్స్‌మన్ మానసిక దృక్పథం సరిగా ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఇబ్బంది అనిపించదు. సరైన ఆలోచనా తీరు లేకుంటే భారత పిచ్‌లూ కఠినంగానే కనిపిస్తాయి. సవాళ్లను ధైర్యంగా స్వీకరించి... సంస్కృతిని ఆకళింపు చేసుకుంటే అంతా స్వదేశంలోలానే అనిపిస్తుంది. గత దక్షిణాఫ్రికా పర్యటనపై నేను 2013–14లో పర్యటించా. నాతో పాటు అప్పట్లో పుజారా, రహానే బాగా ఆడారు. మేమంతా ఎంతో ఉత్సుకతతో పాల్గొన్నాం. ప్రస్తుతం దానిని కొనసాగించడం ముఖ్యం. మంచి ప్రదర్శన కనబరుస్తామనే నమ్మకం ఉంది. నా దృష్టిలో ఏ జట్టుకైనా భిన్న అనుభవాలను మిగిల్చే ప్రతి సిరీసూ ఓ అవకాశమే. దక్షిణాఫ్రికా టూర్ అనగానే గత జట్ల ప్రదర్శనను ప్రస్తావిస్తారు. దిగ్గజాలు లేకున్నా... ప్రస్తుతం సిరీస్ గెలిచేందుకు మాకు అవకాశం ఉంది. నిలకడతోనే విజయాలు... సిరీస్ గెలవాలంటే ఆసాంతం నిలకడైన ఆటతీరు కనబర్చాలి. ఆ సందర్భం కోసం ఆస క్తిగా ఎదురు చూస్తున్నాం. మేం ఒకరి సహచర్యాన్ని మరొకరం ఆస్వాదిస్తున్నాం. దానినే ఆచరణలోకి తీసుకురావాలని చూస్తున్నాం. ప్రత్యర్థి పేస్ బౌలింగ్‌పై... 2013–14తో పోలిస్తే దక్షిణాఫ్రికా బౌలింగ్ అనుభవం గడించింది. నాడు మేం మెరుగైన ప్రదర్శన ఇచ్చాం. వారిపై పైచేయి సాధించాం. జొహన్నెస్‌బర్గ్‌లో దాదాపు గెలిచినంత పనిచేశాం. డర్బన్‌లో పోరాడి ఓడాం. ఇప్పుడు మన బ్యాటింగ్, బౌలింగ్ రాటుదేలాయి. కుర్రాళ్లు గతంలో సాధించలేక పోయిన దానిని ఈసారి సాధిస్తారు. ప్రస్తుత జట్టులోని సభ్యులు నాలుగైదేళ్లుగా కలిసి ఆడుతున్నారు. క్లిష్టమైన సందర్భాల్లో ఈ అనుభవం వారికి ఉపకరిస్తుంది. వరుసగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్నందున ఈ 18 నెలలు మన జట్టు సత్తాను తేలుస్తాయి. ఇందుకు తగినట్లుగానే జట్టుంది. ప్రత్యర్థి పేసర్లకు తగినట్లుగా మనకూ బౌలింగ్ వనరులున్నాయి. వారు భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడితే మన బౌలర్లు వారికి అంతే దీటుగా పోటీ ఇస్తారు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఆడాం. ఇంగ్లండ్, శ్రీలంకలోనూ రాణించాం. మన సన్నాహాలు కూడా బాగున్నాయి. విదేశాల్లో సిరీస్ గెలిచేందుకు ఇది సరైన సమయం. – రవిశాస్త్రి, భారత కోచ్ నా రక్తంలోనే క్రికెట్ ఉంది. జీవితంలో వివాహమనేది ఒక సిరీస్‌ను మించి ఎంతో ముఖ్యమైనది. మా జంట తరచూ గుర్తుచేసుకునే సందర్భం ఇది. ఈ విరామం నా ఆటతీరుపై ప్రభావం చూపదు. మైదానంలో దిగకపోయినా నా మనసునిండా దక్షిణాఫ్రికాతో జరుగబోయే సిరీస్ ఆలోచనలే. మానసికంగా ఎల్లప్పుడూ నేను సిద్ధంగానే ఉన్నాను. – కోహ్లి (భారత కెప్టెన్) -
సౌరాష్ట్ర టి20 టోర్నీలో జడేజా అద్భుతం
రాజ్‌కోట్: భారత క్రికెట్ జట్టు హెడ్‌కోచ్ రవిశాస్త్రికి, స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌లకు ఒకే సారూప్యత ఉంది. వీరిద్దరూ ఎడంచేతి వాటం స్పిన్నర్లే కాకుండా బ్యాట్‌తోనూ చెలరేగి వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన మొనగాళ్లు. ఇప్పుడు ఈ ఇద్దరి సరసన మరో పేరు చేరింది. ఆ పేరే రవీంద్ర జడేజా. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టుకు దూరమైన జడేజా తన సొంత జట్టు సౌరాష్ట్ర తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నాడు. సౌరాష్ట్ర క్రికెట్ సంఘం (ఎస్సీఏ) అంతర్ జిల్లా టి20 టోర్నమెంట్లో శుక్రవారం జడేజా అద్భుతం చేశాడు. అమ్రేలీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జామ్ నగర్ జట్టు తరఫున ఆడిన జడేజా కేవలం 69 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో విరుచుకుపడి 154 పరుగులు సాధించాడు. ఆఫ్ స్పిన్నర్ నీలమ్ వంజా వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో జడేజా ఆరు బంతులను ఆరు సిక్స్‌లుగా మలిచాడు. జడేజా అద్భుత ప్రదర్శనతో జామ్‌నగర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 239 పరుగుల భారీ స్కోరు చేయగా... అమ్రేలీ జట్టు 118 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. గతంలో 2007 టి20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్... 1985 రంజీ ట్రోఫీలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌రాజ్ బౌలింగ్‌లో ముంబై తరఫున రవిశాస్త్రి వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టారు. -
డైలమాలో టీమిండియా సెలెక్టర్లు..
గాలె టెస్టు విజయానంతరం రెండో టెస్టుకు భారత జట్టు కూర్పు సెలక్టర్లకు కత్తి మీద సాములా మారింది. నలుగురు ఓపెనర్లు అందుబాటులో ఉండటం.. గాలే మ్యాచ్‌లో అందరూ రాణించడంతో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీలకు పెద్ద సమస్యగా మారింది. జ్వరంతో లోకెశ్ రాహుల్ తొలి టెస్టుకు దూరం కాగా అతని స్థానంలో అభినవ్ ముకుంద్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో అభినవ్ నిరాశపరిచనప్పటికి రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి కెప్టెన్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తొలుత జట్టులో చోటు దక్కకపోవడంతో హాంకాంగ్‌లో హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు. అనంతరం మెల్బోర్న్ వెళ్లి వన్డేలకు సిద్దమవ్వాలని ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు. కానీ టెస్టు రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కావడంతో అనూహ్యంగా ధావన్‌కు చోటు దక్కింది. టెస్టుల్లో మళ్లీ ఆడాలనే ధృడ సంకల్పంతో ఉన్న ధావన్ అందిన అవకాశాన్ని అందిపుచ్చుకొని చెలరేగాడు. తొలిఇన్నింగ్స్‌లో అద్భుత బ్యాటింగ్‌తో(190) అజెయ సెంచరీ సాధించాడు. గతేడాది న్యూజిలాండ్ సిరీస్‌లో గాయపడి జట్టుకు దూరమైన రోహిత్ శర్మ.. చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకొని అదరగొట్టడంతో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. కానీ తొలి టెస్టులో అవకాశం లభించలేదు. రెండో టెస్టులోనైనా చోటు దక్కుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పుజారా, రహానే, పాండ్యాలు కూడా రాణించడంతో జట్టు కూర్పు పెద్ద తలనొప్పిలా మారింది. ఇప్పటికే ఓపెనర్‌గా ఉన్న రహానేను నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తుండగా.. నలుగురు ఓపెనర్ బ్యాట్స్మెన్లలో ఎవరికీ అవకాశం ఇవ్వాలో అర్థం కాగా కోచ్, కెప్టెన్లు తల బాదుకుంటున్నారు. -
టీమిండియాకు కొత్త కోచ్ లేనట్టే
ముంబై: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్‌ను ఇప్పట్లో నియమించే అవకాశాలు లేనట్టే. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పదవీకాలాన్ని మరో ఏడాది పొడగించారు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్ వరకు టీమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త కోచ్ నియామం కూడా ఇప్పట్లో ఉండదని పేర్కొంది. ఆదివారం బీసీసీఐ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ క్రికెట్ కోచ్‌గా డంకెన్ ఫ్లెచర్ పదవీకాలం ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్‌తో ముగిసింది. 2011లో టీమిండియా కోచ్‌గా నియమితుడైన జింబాబ్వే మాజీ క్రికెటర్ ఫ్లెచర్ నాలుగేళ్లు సేవలందించారు. ఫ్లెచర్ రిటైర్మెంట్ తర్వాత రవిశాస్త్రి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త కోచ్ పదవికి పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే బోర్డు టీమ్ డైరెక్టర్‌గా రవిశాస్త్రి పదవీకాలాన్ని పొడగించడంతో కొత్త కోచ్‌ను ఇప్పట్లో నియమించే అవకాశాల్లేవు.