
ముంబై: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని వరుసగా రెండోసారి నియమించిన భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అతడి వార్షిక జీతాన్ని దాదాపు 20 శాతం వరకు పెంచిందని సమాచారం. దీంతో ఏడాదికి అతని వార్షిక జీతం రూ.10 కోట్లకి చేరే అవకాశం ఉంది. వన్డే ప్రపంచకప్ ఓటమి అనంతరం రవిశాస్త్రిపై వేటు తప్పదని అంతా భావించారు. గత రెండేళ్ల కాలంలో విదేశాల్లోనూ భారత్ జట్టు రాణిస్తుండటం, టీమిండియా ఆటగాళ్లతోనూ రవిశాస్త్రికి ఉన్న సత్సంబంధాలు ఉండటంతో అనూహ్యంగా మళ్లీ అతడినే కోచ్ పదవి వరించింది.
ఇటీవల రెండో పర్యాయం ప్రధాన కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి.. 2021లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ వరకు కోచ్‌గా కొనసాగనున్నాడు. ప్రస్తుతం ఏడాదికి రూ. 8కోట్ల వరకు జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది. తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల వరకు పెరగనుంది. దీంతో ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య ఉండనుంది. సంజయ్ బంగర్ స్థానంలో ఎంపికైన విక్రమ్ రాథోడ్ కూడా వార్షిక వేతనంగా రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు అందుకోనున్నారు.
ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, బౌలింగ్‌కోచ్ భరత్ అరుణ్‌లకు కూడా వార్షిక వేతనాలు పెరిగాయి. వారు ప్రస్తుతం ఏడాదికి రూ. 3.5 కోట్లు వరకు తీసుకుంటారని సమాచారం. పెంచిన జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఇటీవల వెస్టిండీస్ పర్యటనని విజయవంతంగా ముగించిన భారత జట్టు ఈనెల 15 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆసీస్ గడ్డపై దశాబ్దాల నిరీక్షణ అనంతరం గత ఏడాది టెస్టు సిరీస్ గెలిచిన భారత జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ నెం.1 స్థానంలో కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment