టీమిండియాకు కొత్త కోచ్ లేనట్టే
ముంబై: భారత క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ను ఇప్పట్లో నియమించే అవకాశాలు లేనట్టే. టీమిండియా డైరెక్టర్గా రవిశాస్త్రి పదవీకాలాన్ని మరో ఏడాది పొడగించారు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్ వరకు టీమ్ డైరెక్టర్గా రవిశాస్త్రిని కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయించింది. కొత్త కోచ్ నియామం కూడా ఇప్పట్లో ఉండదని పేర్కొంది. ఆదివారం బీసీసీఐ ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది.
భారత్ క్రికెట్ కోచ్గా డంకెన్ ఫ్లెచర్ పదవీకాలం ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్తో ముగిసింది. 2011లో టీమిండియా కోచ్గా నియమితుడైన జింబాబ్వే మాజీ క్రికెటర్ ఫ్లెచర్ నాలుగేళ్లు సేవలందించారు. ఫ్లెచర్ రిటైర్మెంట్ తర్వాత రవిశాస్త్రి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త కోచ్ పదవికి పలువురు పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే బోర్డు టీమ్ డైరెక్టర్గా రవిశాస్త్రి పదవీకాలాన్ని పొడగించడంతో కొత్త కోచ్ను ఇప్పట్లో నియమించే అవకాశాల్లేవు.