సాక్షి, న్యూఢిల్లీ: మరో టెస్ట్ మిగిలుండగానే దక్షిణాఫ్రికా చేతిలో 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్ధతు తెలిపాడు. సఫారీలతో సిరీస్‌కు ముందు భారత్‌లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌తో భారత్‌కు ఒరిగిందేమీ లేదని అదో చెత్త సిరీస్ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికా గడ్డపై ఆ జట్టు చేతిలో సిరీస్ ఓడిన విరాట్ కోహ్లీ సేన వైట్ వాష్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కొందరు మాజీలు చెబుతుండగా భజ్జీ మాత్రం భారత్‌కు మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఎందైనా ఉందంటున్నాడు.
'సఫారీలతో సిరీస్‌కు ముందు స్వదేశంలో లంకతో సిరీస్ వల్ల కోహ్లీ సేన నేర్చుకున్నదేం లేదు. లంకేయులు ఈజీగా ఓటమిని అంగీకరించారు. దాంతో భారత క్రికెట్ జట్టుకు ఒరిగిందేమీ లేదు. బీసీసీఐ సూచించినట్లుగా కొందరు టెస్ట్ స్పెషలిస్ట్ ఆటగాళ్లు కొన్ని రోజుల ముందే దక్షిణాఫ్రికాకు వెళ్లి ప్రాక్టీస్ చేసి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చేవి. లేనిపక్షంలో కనీసం ధర్మశాలలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడినా బాగుండేది. చల్లగా ఉండే ఆ మైదానం ఎంతో ఎత్తులోనూ ఉంటుంది. దక్షిణాఫ్రికా పిచ్‌ల తరహాలోనే స్వింగ్, సీమ్, బౌన్స్‌కు అనుకూలిస్తుంది. రహానేకు చోటు దక్కకపోవడంపై విమర్శిస్తున్నారు. కానీ నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పుడు ఎవరి చోటుపై గ్యారంటీ ఉండదని ఆటగాళ్లు, విమర్శకులు గ్రహించాలి. రోహిత్ స్థానంలో రహానేను తీసుకున్నా భారత్ 0-2తో ఓడితే అప్పుడు విమర్శలు మరోలా ఉండేవి. కోహ్లీ కెప్టెన్సీలో 30 టెస్టులాడిన రహానే సగటు 40 కంటే తక్కువన్న విషయం గుర్తు పెట్టుకోండి. భువనేశ్వర్ కుమార్‌ను పక్కనపెట్టడం మాత్రం నన్ను బాధించింది. భువీ రాణించిన ప్రతిసారీ జట్టు గెలుపొందింది. ఇషాంత్ కంటే భువీనే నా దృష్టిలో బెస్ట్ చాయిస్. చివరి టెస్టులో విజయంతో సిరీస్‌ను 1-2తో ముగిస్తుందని' భావిస్తున్నట్లు హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment