దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ర్యాంకుపై జింబాబ్వే పర్యటన పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ నెల 11 నుంచి జింబాబ్వే-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగనుంది. మొదటి మ్యాచ్ 11న హరారేలో జరుగుతుంది.
ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడినా భారత్ ర్యాంకుపై ఎలాంటి ప్రభావం పడదు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఈ సిరీస్ ఓడినా గెలిచినా అదే స్థానంలో ఉంటుంది. సిరీస్‌లో జింబాబ్వేను చిత్తుచేసి 3-0తో విజయం సాధిస్తే టీమిండియాకు ఒక పాయింట్ లభిస్తుంది. అలాకాకుండా 2-1తో సిరీస్ గెలుపొందితే ధోనీ సేన ఒక పాయింటు కోల్పోతుంది. అయినా ర్యాంకులో ఏ మార్పు ఉండదు.
ప్రస్తుతం 109 పాయింట్లతో టీమిండియా నాలుగో ర్యాంకులో ఉండగా.. 124 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత న్యూజిల్యాండ్ (113), దక్షిణాఫ్రికా (112) ఉన్నాయి. ఇక, అట్టడుగున ఉన్న జింబాబ్వే భారత్ తో సిరీస్‌ను కోల్పోతే ఆ జట్టు పాయింట్లు 48 నుంచి 47కు పడిపోతాయి.
వెస్టిండీస్‌కు చాన్స్
అట్టడుగున ఎనిమిది ర్యాంకులో ఉన్న వెస్టిండీస్ జట్టుకు ప్రస్తుత సిరీస్‌లో తమ ర్యాంకును మెరుగుపరుచుకునే అవకాశముంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే ట్రైసిరీస్‌లో మెరుగైన ఆటతీరు చూపించి విజయాలు సాధిస్తే.. ఆ జట్టు ర్యాంకుల్లో పైకి ఎగబాకే అవకాశం కనిపిస్తోంది.
ఆ సిరీస్ ఓడినా టీమిండియా ర్యాంకు మారదు!
Published Thu, Jun 2 2016 1:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM
Advertisement
Advertisement