బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ )లో అవినీతి చోటుచేసుకున్నది వాస్తవమేనని విచారణ జరిపిన ట్రిబ్యునల్ పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి బుధవారం తీర్పునిచ్చిన ట్రిబ్యునల్.. ఢాకా గ్లాడియేటర్స్ జట్టు యజమానుల్లో ఒకరైన షిహాబ్ జీషన్ చౌదురి స్వయంగా ఓ మ్యాచ్‌ను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించాడని ధ్రువీకరించింది.
అయితే ఈ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న కెంట్ (ఇంగ్లండ్ కౌంటీ) ఆల్‌రౌండర్ డారెన్ స్టీవెన్స్‌తో సహా మరో ఆరుగురికి క్లీన్‌చిట్ ఇచ్చింది. కాగా, గత ఏడాది మేలో బీపీఎల్‌లో మ్యాచ్, స్పాట్‌ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చాక స్వయంగా నేరాన్ని అంగీకరించిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ అష్రాఫుల్.. తనతోపాటు మరో ఆటగాడు కూడా ఉన్నాడని చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే ఆ ఆటగాడెవరన్నది మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. మరోవైపు ట్రిబ్యునల్ తీర్పుపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తోపాటు ఐసీసీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ తీర్పు తమను నిరాశకు గురిచేసిందని, పూర్తి వివరాలు చూశాక తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని బీసీబీ తెలిపింది