రాణించిన జడేజా.. రాహుల్ హాఫ్ సెంచరీ
రాంచీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్(102 బంతుల్లో 67; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. మూడో టెస్టులో రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత జట్టు 40 ఓవర్లలో రాహుల్ వికెట్ కోల్పోయి 120 పరుగులు చేసింది. మరో వికెట్ పడకుండా విజయ్, పుజారా జాగ్రత్తగా ఆడుతున్నారు. ఓపెనర్ మురళీ విజయ్(42 నాటౌట్), చటేశ్వర్ పుజారా(10 నాటౌట్) క్రీజులో ఉన్నారు. అంతకు ముందు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(178 నాటౌట్; 361 బంతుల్లో 17 ఫోర్లు) భారీ సెంచరీ సాధించి అజేయంగా నిలవడంతోపాటు సాధించడంతోపాటు మ్యాక్స్ వెల్(104;185 బంతుల్లో 9 ఫోర్లు) శతకంతో రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగులకు ఆలౌటైంది. భారత స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లతో రాణించడంతో ఆసీస్ జోరుకు బ్రేకులు పడ్డాయి.
299/4 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ ఆదిలో కుదురుగా ఆడింది. ఓవర్ నైట్ ఆటగాడు మ్యాక్స్ వెల్ తాను అరంగేట్రం చేసిన భారత జట్టుపైనే తన టెస్టు కెరీర్ లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ జోడి 191 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత మ్యాక్స్ వెల్ పెవిలియన్ చేరాడు. ఆపై వికెట్ కీపర్ వేడ్ తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. వీరు 64 పరుగుల జోడించి తరువాత వేడ్(37;50 బంతుల్లో 6 ఫోర్లు) ఆరో వికెట్ గా పెవిలియన్ కు వెళ్లాడు. జడేజా బౌలింగ్ లో సాహాకు క్యాచ్ ఇచ్చిన వేడ్ అవుటయ్యాడు.
ఆసీస్ జోరుకు జడేజా బ్రేకులు!
జడేజా ఐదు వికెట్ల ఇన్నింగ్స్‌తో (5124) రాణించడంతో ఐదు వందల పరుగులు చేసేలా కనిపించిన ఆసీస్ 451 పరుగులకు ఆలౌటౌంది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 102వ ఓవర్లో మాక్స్ వెల్ (104) ఇచ్చిన క్యాచ్ ను సాహా పట్టడంతో ఔటయ్యాడు. ఆ తర్వాత 116వ ఓవర్లో నాలుగో బంతికి వేడ్(37)ను ఆరో వికెట్ గా ఔట్ చేసిన జడేజా అదే ఓవర్ లో చివరి బంతికి కమిన్స్ ను డకౌట్ చేయడంతో ఆసీస్ 395 పరుగుల వద్ద ఏడో వికెట్ ను నష్టపోయింది. లంచ్ సమయానికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 401 పరుగులు చేసింది. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఓకీఫ్ (25 పరుగులు)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తరువాత లియాన్(1)ను జడేజా ఔట్ చేశాడు. ఆసీస్ చివరి ఆటగాడు హెజల్ వుడ్(0)ను రాహుల్ విసిరిన బంతిని జడేజా వికెట్లకు విసిరి రనౌట్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది.