భారత్పై పోరుకు విండీస్ యువ అస్త్రం
తొలి టెస్టులో భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వెస్టిండీస్ రెండో టెస్టు కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ యువ కెరటాన్ని భారత్పై అస్త్రంగా ప్రయోగించడానికి సిద్ధమైంది. పేస్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు యువ బౌలర్ కు అవకాశం కల్పించారు. గతేడాది జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో విండీస్ కు ప్రాతినిధ్యం వహించిన టీనేజ్ సంచలనం అల్జారీ జోసెఫ్కు అవకాశం లభించింది. ఆ ప్రపంచకప్ లో రాణించిన బౌలర్లలో జోసెఫ్ ఒకడు.
6.4 అడుగులు ఉండే ఈ యువ బౌలర్ అండర్-19 కప్ లో 13 వికెట్లు తీయడంతో పాటు ఫాస్టెస్ట్ బాల్ 91.5 మీటర్ల వేగంతో విసిరాడు. బౌలింగ్ దిగ్గజం జోయెల్ గార్నర్ మేనేజర్ గా ఉన్న విండీస్ జాతీయ జట్టులో అతడు మరింత రాణించే అవకాశం ఉందని విండీస్ క్రికెట్ సెలక్షన్ ప్యానెల్ చైర్మన్ కోర్ట్నీ బ్రైన్ అభిప్రాయపడ్డాడు. జోసెఫ్ చేరికతో బౌలింగ్ విభాగం మరింత పటిష్టం అవ్వాలని, సిరీస్ లో మిగతా మూడు టెస్టుల్లోనూ జట్టు విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. రెండో టెస్టు కింగ్స్టన్లోని సబినా పార్క్ స్టేడియంలో శనివారం జరగనుంది.