
మాంచెస్టర్: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రిటైర్మెంట్ అంశానికి సంబంధించి వస్తున్న వార్తలపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఈ విషయం తనకే వదిలేయాలని, ఇందులో ఎవరు జోక్యం చేసుకోకూడదని అన్నారు. ఇది తన పర్సనల్ విషయం. తన రిటైర్మెంట్ విషయంపై ధోనియే స్వయంగా ప్రకటించాలని, అప్పటి వరకు అందరూ వేచిచూడాల్సిందేనని సచిన్ ఇండియాటూడేకి ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు. ధోని నిర్ణయాన్ని అందరు గౌరవించాలని, సొంతంగా రిటైర్మెంట్ తీసుకునే హక్కును ధోని కలిగి ఉన్నాడని వ్యాఖ్యానించాడు.
భారత క్రికెట్ చరిత్రలో ధోనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందన్న సచిన్ ... ధోని లాంటి కెరీర్ ఎవరికి ఉంటుందని ప్రశ్నించాడు. ‘అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకం, ఇచ్చే మద్దతు అతని ఆటలో కనబడుతుంది. టీమిండియా క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పటికి మిష్టర్ కూల్ క్రీజులో ఉన్నాడంటే ఆట ఇంకా పూర్తి కాలేదని, కూల్‌గా వెళ్లీ ఎలాగైనా జట్టును విజయం వైపు నడిపిస్తాడన్ననమ్మకం అభిమానుల్లో ఇప్పటికి ఉంది. న్యూజిలాండ్‌తో నిన్నజరిగిన సెమీస్‌లో ధోని ఔటయ్యోవరకు భారత్ ఓడిపోలేదని అందరూ అభిప్రాయపడ్డారు’ అని సచిన్ తెలిపాడు.