పనాజి: హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తనకు అమ్మాయిలంటేనే ఇష్టమని చెప్పింది. కుమారుడికన్నా కుమార్తెలంటేనే ఇష్టమని వారి పేర్లలో మా ఇద్దరి ఇంటి పేర్లు కలిసే ఉంటాయని సానియా చెప్పుకొచ్చింది. దీనిపై తన భర్త పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ఇది వరకే తాను మాట్లాడనని ఆమె తెలిపింది.
‘గోవా ఫెస్ట్’కు విచ్చేసిన సానియా మాట్లాడుతూ.. ‘నేనీ రోజు మా కుటుంబం రహస్యం చెప్పాలనుకుంటున్నా. మాకు సంతానం ఎప్పుడు కలిగినా వారి పేర్లలో ‘మీరా మాలిక్’ను జోడించాలని నేను, మా ఆయన నిర్ణయించుకున్నాం. నిజానికి షోయబ్ కూడా అమ్మాయే కావాలని ఆశిస్తున్నాడు’ అని తెలిపింది. లింగవివక్షకు సంబంధించిన చర్చ తమ బంధువులు, సన్నిహితులతో తరచూ జరిగాయని చెప్పింది.
‘మా తల్లిదండ్రులకు మేమిద్దరం అమ్మాయిలమే. మాకు మాత్రం సోదరుడు లేడన్న బెంగ ఎప్పుడూ లేదు. కానీ మా బంధువులంతా మా వాళ్లతో ఓ అబ్బాయి వుంటే బాగుండేదని, మీ ఇంటి పేరు నిలబడేదని ఎప్పుడు చెబుతుండేవారు. దీంతో నేను మా బంధువులతో తగవుకు దిగేదాన్ని. అమ్మాయిలేం తక్కువని గట్టిగా వాదించేదాన్ని. నిజానికి పెళ్లయ్యాక నా ఇంటిపేరేమీ మార్చుకోలేదు. ‘మీర్జా’ను ఇకముందూ కొనసాగిస్తాను. ఈ కాలంలోనూ ఇంకా అమ్మాయిలు, అబ్బాయిలనే తారతమ్యాలేంటి’ అని సానియా వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment