
ఐఎస్‌ఎల్‌లో వివాదం
సాఫీగా సాగిపోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో వివాదం చోటుచేసుకుంది.
తమ ఆటగాడిని కోల్‌కతా కోచ్ కొట్టాడంటూ గోవా కోచ్ ఫిర్యాదు
మార్గావ్: సాఫీగా సాగిపోతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో వివాదం చోటుచేసుకుంది. అట్లెటికో డి కోల్‌కతా కోచ్ ఆంటోనియో లోపెజ్ హబాస్ తమ ఆటగాడు రాబర్ట్ పైర్స్‌పై చేయిచేసుకున్నట్టు ఎఫ్‌సీ గోవా కోచ్ జికో నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ప్రథమార్ధం ముగిశాక టన్నెల్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సందర్భంగా తన ముఖంపై కోల్‌కతా కోచ్ గుద్దినట్టు పైర్స్ చెప్పాడని జికో తెలిపారు. ‘అట్లెటికో కోచ్ తనను కొట్టినట్టు పైర్స్ నాకు చెప్పాడు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఆ సమయంలో నేను లేను. కానీ పైర్స్ అబద్ధం చెప్పే వ్యక్తి కాదు’ అని గోవా కోచ్ జికో చెప్పారు. అయితే ఈ ఘటనపై ఇరు జట్లు ఐఎస్‌ఎల్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ ఆరోపణలను రెగ్యులేటరీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఐఎస్‌ఎల్ అధికార ప్రతినిధి తెలిపారు.
కోల్‌కతా విజయం: గురువారం జరిగిన మ్యాచ్‌లో మిడ్ ఫీల్డర్ గెవిన్ లోబో కీలక గోల్స్‌తో అట్లెటికో డి కోల్‌కతా 2-1తో ఎఫ్‌సీ గోవాను ఓడించింది. 21వ నిమిషంలోనే ఆండ్రీ సాంటోస్ గోల్‌తో గోవా ఆధిక్యంలోకి వెళ్లింది. 72వ నిమిషంలో లోబో గోల్‌తో కోల్‌కతా.. స్కోరును సమం చేయగలిగింది. 82వ నిమిషంలో లోబో ఎడమ కాలితో చేసిన రెండో గోల్‌తో మ్యాచ్ నెగ్గి తమ టాప్ స్థానాన్ని పదిలపరుచుకుంది.
ఆద్యంతం ఉద్రిక ్తతే..: మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఆరంభం నుంచి చివరి దాకా ఆటగాళ్లు ఒకరికొకరు శత్రువుల్లాగే తలపడ్డారు. 10వ నిమిషంలో ఫిక్రూ నుంచి బంతిని స్వాధీనం చేసుకునే క్రమంలో గోవా ఆటగాడు గ్రెగరీ కాస్త దుందుడుకుగా ప్రవర్తించి అతడిని నెట్టివేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగగా ఫిక్రూ తన తలతో గ్రెగరీ కంటిపై గుద్దడంతో రక్తం కారింది. ఇక ప్రథమార్ధం ముగిసిన అనంతరం కోల్‌కతా కోచ్ పైర్స్‌పై చేయిచేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. మ్యాచ్ ముగిశాక కూడా గోవా ఆటగాళ్లు వేగంగా టన్నెల్ వైపు పరిగెత్తుతూ కనిపించారు. కొందరు మైదానం ఆవల గొడవపడుతూ కనిపించారు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో ఏడుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. కోల్‌కతా సహ యజమాని గంగూలీ ‘ఏం జరిగినా మ్యాచ్ గెలవడమే ముఖ్యం’ అని వివాదాస్పద వ్యాఖ్య చేశారు.