స్వస్ ఓపెన్ క్వార్టర్స్‌లో సింధు
బాసెల్: ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంచలనం పి.వి. సింధు స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 19-21, 21-16, 21-11తో లీ మిషెల్లి (కెనడా)పై చెమటోడ్చి నెగ్గింది.
54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ కోల్పోయినప్పటికీ నిరాశచెందక పోరాడిన తెలుగమ్మాయి వరుసగా రెండు, మూడు గేముల్లో గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సంపాదించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో భారత ఆటగాడు ఆనంద్ పవార్ 21-14, 12-21, 12-21తో టియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు.
చెన్ చేతిలో పవార్ ఓడటం ఇది మూడో సారి. ఈ ఏడాది జర్మన్ ఓపెన్‌లోనూ అతని చేతిలోనే పవార్ ఓడాడు. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ ముందంజ వేసింది. తొలిరౌండ్‌లో ఆరో సీడ్ సైనా 21-12, 21-12తో క్వాలిఫయర్ చిసాటో హోషి (జపాన్)పై విజయం సాధించింది. హైదరాబాదీ స్టార్ కేవలం 34 నిమిషాల్లోనే ప్రత్యర్థిని ఇంటిదారి పట్టించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో మూడో సీడ్ కశ్యప్ 21-15, 21-14తో లుకాస్ ష్మిడ్ (జర్మనీ)పై గెలుపొందాడు.