అంతర్జాతీయస్థాయి బ్యాడ్మిం టన్ ఆటగాళ్లను తీర్చి దిద్దిన పుల్లెల గోపీచంద్ అకాడమీ ఇప్పుడు తొలిసారి హైదరాబాద్ బయట ఏర్పాటు కాబోతోంది.
తణుకు, న్యూస్‌లైన్: అంతర్జాతీయస్థాయి బ్యాడ్మిం టన్ ఆటగాళ్లను తీర్చి దిద్దిన పుల్లెల గోపీచంద్ అకాడమీ ఇప్పుడు తొలిసారి హైదరాబాద్ బయట ఏర్పాటు కాబోతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు గోపీచంద్ అధికారికంగా ప్రకటించారు. చిట్టూరి సుబ్బారావు-గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీగా దీనికి పేరుపెట్టారు. ఇక్కడ అకాడమీ నిర్వహణకు అవసరమైన కోచ్‌లు, సాంకేతిక నైపుణ్యం, సహకారం తదితరాలను గోపీచంద్ అకాడమీ పర్యవేక్షిస్తుంది. ఆర్థిక పరమైన సహకారం చిట్టూరి సుబ్బారావు బ్యాడ్మింటన్ ట్రస్ట్ అందజేస్తుంది.
ఇందులో ప్రధానంగా 8-10 ఏళ్ల వయసు ఉన్న చిన్నారులను ఎంపిక చేసి శిక్షణనిస్తారు. వచ్చే ఫిబ్రవరిలో సెలక్షన్స్ నిర్వహించి 25 మందిని ఎంపిక చేయనున్నారు. వచ్చే మార్చి నుంచి అకాడమీలో శిక్షణ ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కూడా బ్యాడ్మింటన్‌ను చేరువ చేసి భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు గోపీచంద్ వెల్లడించారు.