హైదరాబాద్ లో మరో బ్యాడ్మింటన్ అకాడమీ!
హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ఆటగాళ్లను తీర్చిదిద్దుతున్న భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ హైదరాబాద్ లో మరో బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాడు. సైబారాబాద్ ఏరియాలోని గచ్చిబౌలిలో తొమ్మిది కోర్టులతో కూడిన బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా స్సష్టం చేశాడు. వచ్చే రెండు నెలల్లోపే అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందన్నాడు. అకాడమీ ప్రారంభోత్సవానికి కేంద్ర క్రీడామంత్రి సర్బానంద్ సోనావాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఆహ్వానించనున్నట్లు గోపీచంద్ పేర్కొన్నాడు. వారు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ కార్యక్రమం తేదీని ఖరారు చేస్తామన్నాడు.
గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రస్తుతం ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీలో చాలా మందికి శిక్షణ ఇచ్చినా.. రానురాను శిక్షణ తీసుకునే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతుందన్నాడు. దీనిలో భాగంగానే కొత్త అకాడమీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్టు పేర్కొన్నాడు. అంతకుముందు 2003లో గోపీచంద్ ఎనిమిది కోర్టులతో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆసియాలో ఉన్న అత్యుత్తుమ బ్యాడ్మింటన్ అకాడమీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇదే బ్యాడ్మింటన్ అకాడమీలో పలువురు తెలుగు తేజాలు శిక్షణ తీసుకుని అంతర్జాతీయం విశేషంగా రాణిస్తున్నారు. వారిలో సైనా నెహ్వాల్, పీవీ సింధు, పారుపల్లి కశ్యప్, కిదాంబి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.